Sunday, April 28, 2024

ఇది కదా గెలుపంటే.. ప్రత్యర్థి ఓట్ల కన్నా మెజార్టీ ఓట్లే ఎక్కువ

spot_img

ఎన్నికల్లో పోటీచేసిన వారు వందలో, వేలో ఓట్ల తేడాలో గెలుపొందుతారు. కానీ, ఇక్కడ ఓ లీడర్ మాత్రం ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లతో గెలుపొందాడు. దాంతో అరుదైన రికార్డ్ తన సొంతం చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఈ రికార్డు లభించింది. వరుసగా రెండుసార్లు మెదక్‌ ఎంపీగా, ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు తన సమీప ప్రత్యర్థులకు పడిన ఓట్లకన్నా అధిక మెజార్టీని సొంతం చేసుకున్నారు.

Read Also: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక స్థానం నుంచి 53,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 97,879 ఓట్లు రాగా, సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు కేవలం 44,366 ఓట్లే పోలయ్యాయి. ప్రభాకర్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ కన్నా బీజేపీ అభ్యర్థికి పడిన మొత్తం ఓట్లు దాదాపు 10 వేలు తక్కువే. 2014లో ప్రభాకర్‌రెడ్డి మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి 3.61 లక్షల మెజారీటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి 2.10 లక్ష ఓట్లు రాగా, ప్రభాకర్‌రెడ్డికి పోలైన ఓట్లు 5.71 లక్షలు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రభాకర్‌రెడ్డి 3.16 లక్షల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నిక ల్లో అనిల్‌కుమార్‌కు 2.79 లక్షల ఓట్లే వచ్చాయి. 2019 లోక్‌సభ, 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి చేతిలో రఘనందన్‌ ఓటమిపాలయ్యారు.

అంతేకాకుండా.. ఈ సారి దుబ్బాక స్థానంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ఇక్కడి నుంచి 8 మంది స్వతంత్రులు బరిలో నిలవగా, వీరందరికీ నోటాకు పడిన ఓట్లకన్నా తక్కువ ఓట్లు పడటం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికంగా ఒకరికి 1,197 ఓట్లు రాగా, మరొకరికి వెయ్యి ఓట్లు వచ్చాయి. నోటాకు 2,252 ఓట్లు పోలయ్యాయి. అంటే, నోటాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా ఏ ఒక్క స్వతంత్ర అభ్యర్థికి రాలేదు.

Latest News

More Articles