Thursday, May 2, 2024

మోపెడ్‌ను ఢీకొట్టిన  కారు.. ఐదుగురు దుర్మరణం

spot_img

అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని విల్లుపురానికి చెందిన మణికండన్‌ అనే వ్యక్తి తన భార్య నాగజ్యోతి (28), మామ కనగవేల్‌ (62), అత్త కృష్ణకుమారి (51), తన ఇద్దరు కుమార్తెలు, కొడుకు, మరో ఇద్దరు బంధువులతో కలిసి ధలవాయిపురం ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు వారి వాహనం విదుర్‌నగర్‌-మధురై జాతీయ రహదారిపై తిరుమంగళం సమీపంలోని శివకొట్టై దగ్గర ప్రమాదం బారినపడింది.

ఇది కూడా చదవండి: సనత్ నగర్ లో డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

శివకొట్టైలో పాండి అనే పండ్ల వ్యాపారి తన మోపెడ్‌పై పండ్లు అమ్ముకునేందుకు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పింది. మోపెడ్‌ను ఢీకొట్టి ఆ తర్వాత రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుకు కుడివైపున సర్వీస్‌ రోడ్డుపై పడిపోయింది. ప్రమాదంలో మణికండన్‌ భార్య, అత్త, మామతోపాటు తన కవల కుమార్తెల్లో ఒకరైన శివాత్మిక (8), పండ్ల వ్యాపారి పాండి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మణికండన్‌ మరో కుమార్తె శివశ్రీ (8), కొడుకు శివ ఆదిత్య (5), బంధువులు రత్నస్వామి (64), మీనా (55) లకు తీవ్ర గాయాలయ్యాయి.

కారు నడిపిన మణికండన్‌ ఎయిర్‌ బెలూన్‌లు ఓపెన్‌ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుమంగళం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Latest News

More Articles