Sunday, April 28, 2024

సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్‌కు భారీ మెజార్టీ ఖాయం

spot_img

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్రాబాద్‌ ఎన్నికలు మరోవైపు ఉంటాయని చెప్పారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా పజ్జన్నను ప్రకటించగానే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మారావు గౌడ్‌ ఇంట్లో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిథులతో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యే, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. సికింద్రాబాద్‌ ప్రజలకు పజ్జన్నగా సుపరిచితులని తెలిపారు. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ప్రజల కోసం పనిచేస్తుందని పద్మారావు గౌడ్‌ అన్నారు. ప్రజలే తమ కుటుంబం అని చెప్పారు. తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం. తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్‌ లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని చెప్పారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు డైనమిక్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు అమలుకాలేదని, ప్రజలనే అడిగితే చెప్పారన్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తన ఇంట్లోనే కరెంటు పోతున్నదని విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోలేదన్నారు.

గల్లీ లీడర్లు లేనిది ఢిల్లీ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన నాయకులే ఢిల్లీలో ఉన్నారని చెప్పారు. కిషన్‌ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. దానం నాగేందర్‌ గురించి మాట్లాడాలంటే సిగ్గుగా అనిపిస్తుందన్నారు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీ మారుతూనే ఉంటాడని విమర్శించారు. ఖైరతాబాద్‌ ప్రజలు చైతన్యవంతులని, గతంలో ఆయనను ఓడగొట్టారని గుర్తుచేశారు.

పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి నెంబర్‌ వన్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఊసే లేదని విమర్శించారు. కిషన్‌ రెడ్డి ఎంపీగా సికింద్రాబాద్‌ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యమకారుడైన పద్మారావును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పారు.

పద్మారావు గౌడ్‌ ప్రజల్లో ఉండే వ్యక్తని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. దానం నాగేందర్‌ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. గెలిచినా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటాడనే గ్యారెంటీ లేదని ఎద్దేవాచేశారు. సికింద్రాబాద్‌ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. సికింద్రాబాద్‌ అభివృద్ధికి పద్మారావు గౌడ్‌ కృషిచేశారని చెప్పారు.

సికింద్రాబాద్‌ ఎంపీగా కిషన్‌రెడ్డి విఫలమయ్యారని అంబర్‌పేట ఎమ్మె్ల్యే కాలేరు వెంకటేశ్‌ విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక నిధులు ఏమీ తేలేదన్నారు. బడుగు బలహీన వర్గాల లీడర్‌ అయిన పద్మారావు గౌడ్‌ను సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల మీద పరిజ్ఞానం లేదు

Latest News

More Articles