Thursday, May 2, 2024

ఈ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలోకి రేవంత్ వెళ్లడం ఖాయం

spot_img

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ రెడ్డి త‌న ముఠాతో బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే ప‌రిస్థితి లేదు. ఇక‌ ఆ త‌ర్వాత వెంట‌నే జంప్ అయ్యే వ్య‌క్తి ఈ దేశంలో ఎవ‌రైనా ఉన్నారంటే.. ఇదే రేవంత్ రెడ్డి. ఇది రాసిపెట్టుకోండి అని కేటీఆర్ సూచించారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

తాను మాట్లాడే ప్ర‌తి మాట‌కు రేవంత్ రెడ్డి స్పందిస్తాడు. కానీ బీజేపీలోకి పోత‌వు అని ఆరోప‌ణ చేస్తే ఒక్క మాట అంట‌లేడు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డి చెప్ప‌లేదు. రైతుబంధు, క‌రెంట్ ఇవ్వ‌డానికి చేత‌కాదు. ఆడపిల్ల‌ల పెళ్లిళ్ల‌కు తులం బంగారం ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని లీక్‌లు ఇస్తున్నాడు. ఏమ‌న్న త‌ప్పు జ‌రిగితే విచార‌ణ చేయ్.. త‌ప్పు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకో.. ఇక్క‌డ భ‌య‌ప‌డేటోళ్లు ఎవ‌రూ లేరు. 100 రోజుల్లో ఏ ఒక్క ప‌ని చేయ‌లేదు. రైతులు చ‌స్తుంటే, పొలాలు ఎండుతుంటే చ‌ర్య‌లు లేవు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పైస‌లు కావాల‌ని రైస్ మిల్ల‌ర్ల‌ను, బిల్డ‌ర్ల‌తో స‌హా అంద‌ర్నీ బెదిరిస్తున్నారు. ఇదంతా బ‌య‌ట‌కు రాకుండా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి నువ్వే మున్సిప‌ల్ మంత్రివి. మొన్న‌టి డిసెంబ‌ర్ దాకా నేను మున్సిప‌ల్ మంత్రిని. డిపార్ట్‌మెంట్‌లో ఏం జ‌రుగుతుందో నాకు తెలుసు. గ‌త మూడు నెల‌లుగా హైద‌రాబాద్‌లో బిల్డింగ్ ప‌ర్మిష‌న్లు ఎందుకు ఇవ్వడంలేదు. పైస‌లు క‌డితేనే ప‌ర్మిష‌న్లు వ‌స్తాయ‌ని బిల్డ‌ర్ల‌ను బెదిరిస్తున్న మాట వాస్త‌వం కాదా..? ఢిల్లీకి రూ. 2500 కోట్లు జ‌మ చేసి క‌ట్టిన మాట వాస్త‌వం కాదా..? ఇది దోపిడీ సొమ్ము కాదా..? ఇవాళ ఈ త‌ప్పు ఆ త‌ప్పు జ‌రిగింద‌ని, కేసీఆర్‌ను తిట్టుడు త‌ప్ప ఇంకో ప‌ని చేయ‌డం లేదని విమర్శించారు కేటీఆర్.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లో ప‌ద‌కొండున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాల‌కు 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితంగా నీళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొన్న 8 ల‌క్ష‌ల కుటుంబాల‌కు కొత్త‌గా వేల రూపాయాల బిల్లులు పంపిస్తున్నారు. దాని మీద కొట్లాడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉందన్నారు కేటఆర్. 200 యూనిట్ల వ‌ర‌కు ఫ్రీ క‌రెంట్ అన్నారు. కిరాయి ఉన్నోళ్ల‌కు వ‌ర్తించ‌ద‌ని చెప్పి.. కేవ‌లం ఓన‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు అన్ని అంద‌రికీ వ‌ర్తిస్తాయ‌ని చెప్పి.. ఇప్పుడేమో అన్ని క‌టింగ్‌లు చేస్తున్నారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాలి. కాంగ్రెసోళ్లు న‌మ్ముకున్న‌ది ప‌చ్చి అబ‌ద్దాల ప్ర‌చారాల‌ను, యూట్యూబ్ చానెళ్ల‌ను అడ్డం పెట్టుకుని ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: ఆప్‌ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్‌.. మూడు మెట్రో స్టేషన్లు మూసివేత

Latest News

More Articles