Friday, May 10, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌

spot_img

హైదరాబాద్‌: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.

తెలంగాణ ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సిట్ దర్యాప్తు సాగించాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది.

మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 455/2022) సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌లో కోరింది.  ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పిటిషన్ లో పేర్కొన్న ముఖ్యంశాలు

‘‘సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదు. ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం మాట్లాడారు. సీఎం ప్రెస్‌మీట్‌ను ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూడాలి. ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నమే సీఎం వ్యాఖ్యలు.

ఎఫ్‌ఐఆర్‌, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న అంశాలపైనే సీఎం మాట్లాడారు. సీఎం మాట్లాడినవి జాతీయ పార్టీని ఉద్దేశించిన రాజకీయ వ్యాఖ్యలు. మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదు. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశం. సీఎం వీడియోలను బహిరంగపరిచారు కాబట్టి సిట్ వల్ల ఉపయోగం లేదనడం ఊహాజనితం.

సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం పొరపాటు. సీఎం ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదు. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదు. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని పిటిషనర్లే కోరలేదు.

సిట్ రద్దు చేయాలని పిటిషనర్లు కూడా కోరలేదు. నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదు. సిట్ పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదు. యూట్యూబ్‌లో వీడియోలను పరిగణలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందనేది ఎఫ్‌ఐఆర్ సారాంశం.

కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లే. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా తీర్పు ఉంది. యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు నష్టమెలాగో వివరించలేదు. ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమి కాదు. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటు. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుంది. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు. ’’ అని పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Latest News

More Articles