Saturday, April 27, 2024

మోదీ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తుంది. ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోవాల్సిందే

spot_img

హైదరాబాద్: దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయని, మోదీ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉండాలని కోర్టులు స్పష్టంగా చెప్పినా.. మోదీ సర్కార్ పెడచెవిన పెట్టడం దుర్మార్గం అన్నారు. కోర్టుల తీర్పులనే పట్టించుకోకుంటే.. ప్రజాస్వామ్యానికి అర్థం ఎక్కడ ఉందని అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను మోదీ సర్కార్ గౌరవించాలని, వెంటనే ఢీల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డెనెన్స్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశంపై ఎమర్జెన్సీని రుద్దిన ఇందిరాగాంధీ లాంటీ పవర్ పుల్ నేతనే దేశ ప్రజలు తిరస్కరించిన విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మోదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఇలాంది ధోరణులు ఎవరికి మంచిది కాదని నిప్పులు చెరిగారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాని, దానికి కున్న హక్కులను కేంద్రం గౌరవించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

దేశంలో ఉన్న ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నాన్-బీజేపీ ప్రభుత్వాలను  మోదీ సర్కార్ వేధిస్తుందని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థతో రాష్ట్రాల పాలనను అడ్డుకుంటుందని, కోర్టులకు పోతేగాని బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేదని అసహనం వ్యక్తం చేశారు. వంగి వంగి దండాలు పెట్టినా.. కర్ణాటక ప్రజలు బీజేపీని కర్రు కాల్చి వాత పెట్టారు. ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీని తరిమి కొడతారు. మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని, అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.

ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన  ఆర్డెనెన్స్ ను మోదీ సర్కార్ బేషరతుగా వెనక్కు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆప్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా ఉంటుందని, మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. ఆర్డెనెన్స్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఓటు వేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతకు ముందు తనన కలిసేందుకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ బృందానికి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. అనంతరం  ముగ్గురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు.

Latest News

More Articles