Thursday, May 2, 2024

స్మోకింగ్ తో పుట్టబోయే పిల్లలకు హానికరమే..!

spot_img

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఎంతగా అంటే మీ ఆరోగ్యమే కాదు మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చేంతగా అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరించారు. పొగతాగే అలవాటు వల్ల పురుషులలో శుక్ర కణాల డీఎన్ఏ దెబ్బతినడమే దీనికి కారణమని అంటున్నారు. వీర్య నాణ్యతపై ప్రభావం పడంతో పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని తెలిపారు. గర్భం నిలవక పోవడం, పదే పదే అబార్షన్ జరగడంతో పాటు పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు. పొగతాగే అలవాటుతో పాటు మద్యపానం, మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని చెప్పారు.

వీర్యంలో తక్కువస్థాయి యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయని, డీఎన్‌ఏను చక్కబెట్టే వ్యవస్థ పని చేయకుండా ఉంటుందని ఎయిమ్స్ లోని అనాటమీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్ రీమా దాదా  తెలిపారు. స్పెర్మ్ డీఎన్ఏను అనారోగ్యకర జీవనశైలి, మద్యపానం, ప్రాసెస్డ్ ఫుడ్, కాలుష్యం మరింత దెబ్బతీస్తున్నాయని వివరించారు. వీటికి తోడు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, పిల్లలు కనడానికి ఆలస్యం చేయడం కూడా వీర్యం నాణ్యత మరింత క్షీణించడానికి కారణమవుతున్నాయని ప్రొఫెసర్ రీమా చెప్పారు. వయసు పెరుగుతున్నకొద్దీ డీఎన్ఏ నాణ్యత తగ్గుతుందన్నారు. దెబ్బతిన్న వీర్యం కారణంగా పుట్టే పిల్లల్లో జన్యు లోపాలతో పాటు అంగవైకల్యం తదితర సమస్యలు ఏర్పడే ముప్పు ఉంటుందన్నారు. సంతానలేమి, పదే పదే అబార్షన్ జరగడానికి స్పెర్మ్ డీఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని ప్రొఫెసర్ డాక్టర్ రీమా చెప్పారు.

ఇది కూడా చదవండి: శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్..డ్యాన్స్ తో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్..!

Latest News

More Articles