Wednesday, May 1, 2024

విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది ?

spot_img

అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో ముగ్గురు ఆంధ్రా అధికారులే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. నందకుమార్, నర్సింలు, సుధా మాధూరి ని డైరెక్టర్లుగా నియమించారని తెలిపారు. తెలంగాణకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను పక్కనబెట్టి ధర్మాధికారి కమిషన్ నివేదికను సాకుగా చూపించి ఆంధ్ర వాళ్లను నియమించారని,  తెలంగాణ ప్రయోజనాలపై వాళ్లకు ఏం ఆసక్తి ఉంటుందని ప్రశ్నించారు. “కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క నిమిషమైన కరెంటు పోయిందా ?  హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే… దీని వెనుక ఆంధ్రా కుట్ర లేదా ? మీలో ఉన్న పచ్చరక్తం మీ చేత ఈ పని చేపించడం లేదా ? ” అని అని ప్రశ్నించారు. ఈ ముగ్గురు డైరెక్టర్లను తొలగించి వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి సలహాదారులే ఉండవద్దని కోర్టుల్లో బీఆర్ఎస్ హయాంలో కేసులు వేసిన రేవంత్ రెడ్డి …. ఇవాళ ఎంత మందిని సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను సలహాదారుగా నియమించుకుంటే ఏదో అనుకోవచ్చు కానీ ఢిల్లీలో ఒక మాజీ న్యాయమూర్తి  దగ్గర పనిచేసిన వ్యక్తిని లేని కొత్త పోస్టును సృష్టించి అసెంబ్లీకి సలహాదారునిగా నియమించడమేంటి ? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కేసులు, ఓటుకు నోటు కేసులో వాదించిన దేవనా సైగల్ ను సుప్రీం కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా,  తేర రజినీకాంత్ రెడ్డిని అదనపు అడ్వొకేట్ జనరల్ లా నియమించడంతో పాటు ఆయన అధికారంలోకి రాకముందు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపడానికి దొంగ కేసులు వేసిన ఒక న్యాయవాదిని సుప్రీం కోర్టులో అడ్వొకేట్ ఆన్ రికార్డుగా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో తటస్థతంగా పనిచేసే వాళ్లు ఎవరూ లేరా ? అని నిలదీశారు. వ్యక్తిగత బృందాన్ని కోర్టుల్లో నియమించడం అధికార దుర్వినియోగం చేయడమేనని తేల్చిచెప్పారు.  రేవంత్ రెడ్డి చెప్పిన నీతి వాఖ్యాలను పాటిస్తే ఆయనే బాగుంటుందని, ఉద్యోగాల విషయంలో అడ్డంగా అబద్దాలు చెప్పి కేసీఆర్ ను బద్నాం చేశారని చెప్పారు.

అలాగే, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, రాష్ట్ర గీతంపై విలేకరులు అడిగిన  ఒక ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ…. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా హృదయంపై చేయి వేసుకొని జై తెలంగాణ అంటే ఇవన్నీ చేసే అర్హత ఉంటుందని, కానీ ఎప్పుడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం హాస్యాస్పందగా ఉందన్నారు. రాష్ట్ర గీతం, జెండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని, రెండు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తే సుప్రీం కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదని,  కాబట్టి బీఆర్ఎస్ హయాంలో అటువంటి వివాదంలోకి వెళ్లలేదని వివరించారు.

పూర్తి స్థాయి బడ్జెట్ కాకండా ఓటాన్ ఎకౌంట్ ను ప్రవేశపెట్టబోవడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ఇచ్చిన వాగ్దానాలకు కేటాయింపులు చేపడ్డం నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తున్నారని అన్నారు. ఓటాన్ ఎకౌంట్ కాకుండా పూర్తి  స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడైనా నిజాలు చెప్పాలి

Latest News

More Articles