Sunday, April 28, 2024

వైరలవుతున్న సచిన్ డీప్ ఫేక్ వీడియో

spot_img

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌‎కు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌కు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేశారు. వెంటనే ఈ వీడియోపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also: గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అమ్మాయిలా రెడీ అయి ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లిన లవర్ బాయ్

‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌కు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు.

‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి. సోషల్‌ మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉంటూ.. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రికి, మహారాష్ట్ర సైబర్‌ విభాగానికి ట్యాగ్‌ చేశారు.

Latest News

More Articles