Tuesday, May 7, 2024

ఈ రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

spot_img

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. రెండో రోజును ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజును ‘కనుమ’గా పిలుస్తారు. నాలుగో రోజును ‘ముక్కనుమ’ అంటారు.

Read Also: మధ్యాహ్న భోజనానికి స్కూల్‌ బెంచీలే కట్టెలు

భోగి పండగ రోజున ఉదయమంతా భోగి మంటలతో సందడిగా గడిపితే.. సాయంత్రం వేళ బుజ్జాయిలకు భోగి పళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేగు పండ్లనే ఈ రోజున భోగి పళ్లుగా పిలుస్తారు. వీటికే అర్కఫలం అనే పేరూ ఉంది. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి… సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, వారిపై ఉన్న చెడు దిష్టంతా పోతుందనీ నమ్ముతారు. అంతేకాదు, ఇవి తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రంపై పడటం వల్ల అది ప్రేరేపితమై చిన్నారుల్లో మేధస్సు పెరుగుతుందనీ భావిస్తారు.

ఎలా పోయాలి: రేగిపండ్లలో బంతి పూల రేకులూ, చిల్లర నాణేలూ, చెరకు గడల ముక్కలూ కలిపి తల్లి మొదలుకుని మహిళలంతా తలో దోసిటతో వీటిని తలచుట్టూ మూడు సార్లు తిప్పి వేస్తారు. ఈ క్రమంలో చుట్టూ చేరిన పిల్లలు… ఆ భోగిపళ్లలో ఉండే చిల్లర పైసలు పట్టుకోవడానికి పోటీపడుతుంటారు. ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి చర్మానికి తగిలితే చర్మసంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట.

రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.

Latest News

More Articles