Sunday, April 28, 2024

కేసీఆర్‎ను బొంద పెడతామన్న వారెందరో బొందలోనే కలిసి పోయారు

spot_img

నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్.. దానికనుగుణంగానే కేసీఆర్ పాలన సాగిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‎లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

‘శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులు. వీటిని కేఆర్ఎంబీ పరిధిలోకి తేవడానికి 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. నీటి వాటా తేల్చేంత వరకు కేఆర్ఎంబీలో చేరడానికి కేసీఆర్ ససేమిరా అన్నారు. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం చేసే నిర్ణయాలు కొన్ని జరిగాయి. సీలేరు కోల్పోవడానికి, ఏడు మండలాలు ఏపీలో కలపడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్. వాటి కనుగుణంగానే కేసీఆర్ పాలన సాగింది. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు కేసీఆర్ రక్షణ కవచంలా నిలిచారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్‎ను కేఆర్ఎంబీ విషయంలో విమర్శించడం ఓ వింత. కేఆర్ఎంబీ పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులను చేర్చకుండా తొమ్మిదిన్నరేళ్ళు కేసీఆర్ ఆపగలిగారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్‎లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహారాలోకి వెళతాయి. నీటి వాటా తేల్చేదాకా కేఆర్ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలి.

Read Also: హోటల్‎లో సెక్స్ రాకెట్ నడుపుతున్న హైదరాబాద్ పహిల్వాన్ అరెస్ట్

ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలు కాంగ్రెస్‎ను భారీ సీట్లతో గెలిపించినందుకు మీరిచ్చిన బహుమానమా ఇది. ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చెందుకే కేంద్రం కంకణం కట్టుకుంది. కేంద్రం ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికింది. ఇంత తీవ్రమైన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుంది. రాష్ట్ర ప్రజల మీద థర్మల్ విద్యుత్ భారం పడేలా కుట్ర జరుగుతోంది. కేఆర్ఎంబీలో ప్రాజెక్టులు చేర్చడం పెద్ద కుట్ర. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఢిల్లీకి వెళదామంటే మేం కూడా కలిసి వస్తాం. హరీష్ రావు నుంచి నేర్చుకోవాలని ఉత్తమ్‎కు మేం చెప్పడం లేదు. అంత పరిజ్ఞానం ఉంటె.. ఇంత తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నారు? కేఆర్ఎంబీ పేరిట కృష్ణా నీళ్లపై ఏపీ పెత్తనం సాగిస్తుంది. తన శిష్యుడు తెలంగాణ సీఎం అయ్యారని ఒకాయన సంబర పడుతున్నాడు. తాను తెలంగాణ సీఎంగా లేకున్నా తన ఎజెండా శిష్యుడు అమలు చేస్తున్నాడని గురువు సంబర పడుతున్నాడు. అధికారిక పర్యటనలో సీఎం రాజకీయాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‎ను బొంద పెడతామన్న వారెందరో బొందలో కలిసి పోయారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం అంటే మంత్రులు మిన్న కుండి పోయారు. 45 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసే చర్యలు ప్రారంభించింది. రాష్ట్రం తెచ్చుకున్న ప్రయోజనాన్ని కాంగ్రెస్ దశాబ్ద కాలంలోనే మంట గలుపుతోంది. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సఖ్యత గురించి రేవంత్ గొప్పగా చెబుతుంటారు. కేఆర్ఎంబీలో తాము చేరేదిలేదని కేంద్రంతో రేవంత్ గట్టిగా ఎందుకు చెప్పలేక పోతున్నారు’ అని సింగిరెడ్డి ప్రశ్నించారు.

Latest News

More Articles