Friday, May 10, 2024

ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు

spot_img

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన కంటి వెలుగు సన్నద్ధతపై ప్రారంభమైన మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిదులందరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రపంచంలోనే నిర్దేశిత కాలంలో పెద్ద సంఖ్యలో కంటి పరీక్షలు నిర్వహించి, మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతం చేసిందని, 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు.  అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.  మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నరు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది అన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటుందన్నారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో ఉంటారన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారు అని, ప్రజల కోణం లో ఆలోచిస్తారని చెప్పారు. ప్రభుత్వం పరంగా అన్ని చేస్తామని, అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసింది అన్నారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

ఈనెల 12 లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్ లోనూ పూర్తి చేసి షెడ్యూల్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంప్స్ నిర్వహణ తేదీలు ప్రచురించాలని ఆదేశించారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్ లలో కంటి వెలుగు పై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు.

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. 1 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అధికారులు  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పరీక్షలు చేసుకోవడం మిస్ అయిన వారీ కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 929 వైద్యులను కొత్తగా ప్రాథమిక అరోగ్య కేంద్రంలో నియమించుకున్నామని, ఇతర అరోగ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందన్నారు.

గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం ఉన్నారు. నెరవేరడం లో మనందరిది ముఖ్య పాత్ర కీలకం అన్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం అనీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం తోనే కార్యక్రమం విజయవంతం కావడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ ఉద్దేశ్యం కాబట్టి, అందరం కలిసి పని చేసి, కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

బీఆర్కె భవన్ నుండి మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles