Sunday, May 5, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు..

spot_img

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంపై మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్  స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లో చేరబోనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. గంగులపై దుష్ర్పచారం చేస్తు బద్నాం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. తానంటే గిట్టనివారు, తన ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. పార్టీ మారే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లేదా బీజేపి లో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ ఆలస్యం చేయడంతో గంగుల కమలాకర్ రాక కోసమే అభ్యర్థిని ఎంపిక చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. మైండ్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళ కేసీఆర్ పాలన చూసిన తర్వాత తనతోపాటు రైతులు, ప్రజలు గులాబీ నేత పక్షానే ఉంటామని అంటున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపి మధ్యనే పోటీ ఉంటుందనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజల తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని కరీంనగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు.

భూగర్భజలాలు అడుగంటి, కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించకపోవడంతో ఎండిపోయిన పంటపొలాలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత  కేసిఆర్ రేపు(శుక్రవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశీలిస్తారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే రైతుల పంటలు ఎండాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:డిసెంబర్ 9వ తేదీని మర్చిపోయారా సీఎం రేవంత్

Latest News

More Articles