Monday, May 6, 2024

‘బీఆర్ఎస్’తో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయం

spot_img

హైదరాబాద్: ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని,   ప్రజల కోసం పనిచేసే పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరేడు దశాబ్దాలుగా గెలిపించిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మహారాష్ట్ర బిజెపి పార్టీకి చెందిన మైనార్టీ నేతలు ఆదివారం హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్రలో పుష్కలమైన సహజవనరులున్నాయని, అక్కడే ఎన్నో నదులు పుట్టి, ప్రవహిస్తున్నా గ్రామాలు, పట్టణాలు నీళ్ళు లేక ఎందుకు గోసపడుతున్నాయో, అందుకు కారణమైన మూలాన్ని ప్రజలు గుర్తించాలని సీఎం కోరారు.

మనం ఓట్లేస్తూ పోతున్నాం, వాళ్ళు గెలుస్తూ పోతున్నారు. ఇకనైనా మన ఆలోచనతీరు మారాలి. ఫూలే, అంబేద్కర్ వంటి ఎందరో సంఘసంస్కర్తలు, మేధావులు పుట్టిన నేల నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక వెనుబాటుకు గురికావడం శోచనీయమని సీఎం అన్నారు. వారి స్ఫూర్తితో దేశంలో సమూల మార్పే లక్ష్యంగా ప్రజలు చైతన్యులై ఉద్యమించాలని సీఎం కోరారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అధికారం ఇస్తూ పోతున్నా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోవడంపై ప్రజలు, యువత ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఉద్యమించిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని సీఎం కోరారు. బిజెపి పాలనలో హిందువులు,ముస్లింలు, ఇతర వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదని, మతం పేరుతో పబ్బం గడుపుకోవడమే బిజెపి వ్యూహమని సీఎం తేల్చిచెప్పారు.

సహజవనరులకు నెలవైన మహారాష్ట్రను ఇప్పటిదాకా పాలించిన పార్టీలు లూటీ చేశాయని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని సీఎం అన్నారు. తెలంగాణ పథకాలను అమలు చేస్తే అక్కడి పార్టీలే దివాలా తీస్తాయి కానీ ప్రజలు కాదనీ, ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు ప్రసరిస్తాయని సీఎం అన్నారు. బిఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వల్యాల నగేష్ నేతృత్వంలో ముస్లిం మైనార్టీ నేతలు, బీడ్ జిల్లా నుంచి ఫూల్ చంద్ కరాడ్ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే ముల్లర్ అంకోలా నుంచి, మహారాష్ట్ర కిసాన్ సెల్ ప్రెసిడెంట్ సంజయ్ పాటిల్ కొల్లాపూర్ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎమ్మెల్సీ లు పల్లా రాజశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, బిఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోండ్గే, మాణిక్ కదమ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles