Tuesday, May 7, 2024

తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు. !

spot_img

తక్షణమే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి..నాలుగు నెలలు అవుతున్నా ఒక్కరైతుకు కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ కిస్తీలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తీసుకున్న రుణాలు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడికి గురిచేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. బ్యాంకుల ఒత్తిడి, ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారన్నారు. వెంటనే రూ. 2లక్షల రుణమాఫీ ఎప్పటివరకు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.

హరీశ్ రావు లేఖలో ఏం పేర్కొన్నారంటే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదు.

బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలు తో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Latest News

More Articles