Friday, May 10, 2024

ఢిల్లీ పోలీసుల ఛార్జ్ షీట్‌పై రెజ్లర్ల అసంతృప్తి వ్యక్తం

spot_img

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ (డబ్ల్యుఎఫ్‌ఐ) బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్‌ పై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైనర్‌, ఆమె కుటుంబంపై చాలా ఒత్తిడి ఉందని స్పష్టంగా తెలుస్తోందని.. ఛార్జ్ షీట్‌ ని చూసిన తర్వాత ఆందోళనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఒలింపిక్‌ విజేత సాక్షి మాలిక్‌. ప్రస్తుతం ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయించామని, ఒకటి, రెండు రోజుల్లో ఉద్యమం కొనసాగింపుపై కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఛార్జ్ షీట్‌ కాపీని సమర్పించాల్సిందిగా తమ తరపు న్యాయవాది కోర్టును కోరారని చెప్పారు.

1082 పేజీల ఛార్జ్ షీట్‌ ని చదవకుండా తాను ఏమీ మాట్లాడలేనని మరో రెజ్లర్‌ తెలిపారు. రెజ్లర్లు ఏ నిర్ణయం తీసుకున్నా.. వారికి రైతు సంఘం మద్దతు ఉంటుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ప్రతినిధి రాజేష్‌ తికాయత్‌ తెలిపారు.

బ్రిజ్‌ భూషణ్‌పై నిన్న(గురువారం) ఢిల్లీ పోలీసులు 1082 పేజీల ఛార్జ్ షీట్‌ ను సమర్పించారు. పోక్సో చట్టం కింద దాఖలైన రెండో కేసులో బ్రిజ్‌ భూషణ్‌ పై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆ కేసును కొట్టేయాల్సిందిగా మరో 552 పేజీల ఛార్జ్ షీట్‌ లో తెలిపారు.

Latest News

More Articles