Sunday, May 5, 2024

లెక్కలు రాస్తున్నాం.. వడ్డీతో సహా తీర్చుకుంటాం

spot_img

కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని.. మనకు నష్టం చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదని తెలిపారు. లెక్కలు రాస్తున్నామని.. వడ్డీతో సహా తీర్చుకుంటామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం శామీర్‌పేటలోని అరణ్య అతిథి గృహంలో జరిగింది. సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు.. భవిష్యత్తు మనదేనని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని. అప్పటిదాకా ఓపిక పట్టాలని సూచించారు.

కే కేశవరావుకు ఏం తక్కువ చేశాం.. రాజ్యసభ పదవి ఇచ్చాం.. ఆయన కుమార్తెకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి.. కుమారుడికి చైర్మన్‌ పదవి ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. అన్ని ఉద్దెర పథకాలు మొదలుపెట్టి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పలు సంస్థలు దివాళా తీస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో కరువు వచ్చిందని హరీశ్‌రావు  అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎలా ఉండే.. ఇవాళ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. వచ్చిపోయే కరెంటుతో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని అన్నారు. వడగండ్ల వాన వచ్చిన నష్టం జరిగితే కనీసం ఓదార్చడానికి కూడా ముఖ్యమంత్రి, మంత్రులకు తీరిక లేదని విమర్శించారు. దీన్నిబట్టే రైతులు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. కొత్త పనులు మంజూరు చేయరు గానీ.. గతంలో మంజూరు చేసి జరుగుతున్న పనులను రద్దు చేయడం ఈ సీఎంకే చెల్లిందన్నారు.

సిద్దిపేట జిల్లాలో రూ.150 కోట్ల విలువైన పనులు రద్దయినట్లు తెలిపారు హరీశ్ రావు. ఇలాంటి వాళ్లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. రద్దు చేసిన పనులపై గ్రామాల్లో చర్చపెట్టి ప్రజలు వివరించాలని అన్నారు. తమ ప్రాణం అడ్డుపెట్టి అయినా కార్యకర్తల వెంట ఉంటామని భరోసా ఇచ్చారు.

భూకబ్జాలు చేసిన వారు మాత్రమే పార్టీ మారుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న ఈ పదేండ్లలో ఎవరినీ వేధించలేదని ఆయన తెలిపారు. కేసీఆర్‌ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించిన నేత కేసీఆర్‌ అని అన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు పోయాయి

Latest News

More Articles