Wednesday, May 1, 2024

కాంగ్రెస్ నేతలపై భగ్గుమన్న సీఎం కేసీఆర్

spot_img

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ తీసి బంగాళఖాతంలో విసిరేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా పైసుల రైతుల ఖాతాలలో పడుతున్న విషయం ఆ సన్యాసులకు తెలుసా అని ప్రశ్నించారు.

ధరణి వద్దంటున్న దుర్మార్గులు 50 ఏండ్లు పాలన చేశారు. మనకు నీళ్లు కూడా ఇయ్యలే. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహాణీలు మారిపోయేవి. ధరణితో ఆ సమస్యలన్నీ తీరాయి. కాంగ్రెస్‌ నేతలు ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నా.. ఆ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లా క‌లెక్టరేట్‌, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంత‌రం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు.

ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో.. తెలిసేది కాదు, ఇప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాము. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో బాధలు పడ్డాం. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధుకు రాంరాం పలుకుతారు. వీఆర్వోల దోపిడీ, పహనీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేడం చూడలేదా? ఇవాళ రిజిస్ట్రేషన్‌ కావాలంటే 15 నిమిషాల్లో అయిపోతుంది. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అవుతుందన్నారు.

ధరణి తీసివేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి? ఎన్ని దరఖాస్తులు పెట్టాలి? అందరు నాకు గట్టిగా చెప్పాలి. ధరణి ఉండాలా? తీసివేయాలా?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దీనికి జనం ధరణి ఉండాలంటూ నినదించారు. ఈనెల 8న గ్రామాల్లో చెరువుల దగ్గర పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్సారెస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

సీఎం కేసీఆర్ తో పాటు బహిరంగ సభలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,  ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రేఖా శ్యామ్ నాయక్ ,విట్టల్ రెడ్డి ,దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు ,ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విట్టల్ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles