Wednesday, May 1, 2024

ధరణి తీసి.. మళ్లీ పట్వారీ వ్యవస్థను తెస్తరా? కాంగ్రెస్ పై భగ్గుమన్న సీఎం కేసీఆర్‌

spot_img

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ చేతిలో నానా కష్టాలు పడటం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్‌ నాయకులు బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే బంగాళాఖాతంలోకి విసిరి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

60 ఏండ్లు దేశాన్ని ఏలి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిన దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇప్పుడు న్న తెలంగాణ ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం నిర్మల్‌ జిల్లా లో పర్యటించారు.

నిర్మల్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్మల్‌లోని క్రషర్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

మళ్లీ వీఆర్వో, పట్వారీ వ్యవస్థను తెచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని, నాటి దోపిడీ పాలననే కాంగ్రెస్‌ దుర్మార్గులు కోరుకొంటున్నారని నిప్పులుచెరిగారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని, ఎవరి భూములు ఎవరి చేతుల్లో ఉండేవో తెలియకపోయేదని.. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత అలాంటి దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లు సీఎం స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేస్తే రైతుబంధును, దళిత బంధును కూడా రద్దుచేస్తారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ పార్టీయే రక్ష అని, పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కాంగ్రెస్‌ దుర్మార్గుల పరిపాలన మనం చూడలేదా? భూమి రికార్డులు మార్చేయడం చూడలేదా? అని ప్రశ్నించారు. ఈరోజు భూమి రిజిస్ట్రేషన్‌ 15 నిమిషాల్లో అయిపోతది. పట్టా 10 నిమిషాల్లో చేతిలో పెడుతున్నారని వివరించారు.

ధరణి తీసేస్తే మళ్లా ఎన్ని రోజులు తిరగాలె? ఎన్ని దరఖాస్తులు పెట్టాలె? మళ్లీ పైరవీకారుల వ్యవస్థను తేవాలనుకొంటున్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయడాన్ని చూసి మహారాష్ట్ర వాసులు  ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ చెప్పారు. ఇవన్నీ ధరణితోనే సాధ్యమవుతుందని వివరించారు.

Latest News

More Articles