Tuesday, May 7, 2024

పోలీస్‌ శాఖలో బదిలీల గందరగోళం.. అధికారుల్లో అసహనం

spot_img

రాష్ట్రంలో కొద్ది రోజులుగా పోలీసు డిపార్ట్ మెంట్ లో బదిలీలు జరుగుతున్నాయి. అయితే బదిలీలపై పోలీసు ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోస్టింగ్‌ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్‌ శాఖలో బదిలీల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. వరుస బదిలీలపై అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు కేవలం ఎన్నికల నియమావళి మేరకేనంటూ ఉన్నతాధికారులు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నది.

ఒక అధికారిని ఒక ప్రాంతానికి బదిలీ చేసిన మరుసటి రోజే తిరిగి ఆ ఉత్తర్వులు రద్దు చేయడం, ట్రాన్స్ఫర్ అయిన అధికారిని అదే స్థానంలో పోస్టింగ్‌ కల్పించడం..ఇదేక్కడి ఎన్నికల నియమావళి అంటూ కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీలు చేస్తే.. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాల ఆధారంగానే పోస్టింగ్‌ కల్పిస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న బదిలీల తీరులో ఒక అధికారిని ట్రాన్స్ ఫర్‌ చేసి, కొత్త పోస్టింగ్‌ కల్పించిన వారం లోపే మళ్లీ ట్రాస్న్ ఫర్ చేయడం పలు విమర్శలకు తావిస్తున్నది.

కొత్త పోస్టింగ్‌లు తీసుకున్న ఏసీపీలు ఆ ప్రాంతంపై పట్టు సాధించే లోపే బదిలీకావడం వల్ల స్థానికంగా శాంతిభద్రతలు పట్టు తప్పే ప్రమాదం లేకపోలేదంటున్నారు సీనియర్‌ అధికారులు. అలాగే ఈ మధ్య ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి డీసీపీ స్థాయిల వరకు తరచూ బదిలీలు జరుగుతుండడంతో కేసుల దర్యాప్తు మందగిస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఎన్నికల నియమావళిలో భాగంగా బదిలీలు చేయాలంటే ఆ అధికారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఇందుకు అనుగుణంగా బదిలీ చేయాలి. అంతే తప్ప.. నాలుగు రోజులకోసారి అధికారులను బదిలీ చేయడం, ఒకచోట నుంచి బదిలీ చేసిన అధికారికి తిరిగి మళ్లీ అదే చోట పోస్టింగ్‌ కల్పించడం వంటి వ్యవహారాలపై పలువురు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బ్యాడ్మింటన్‌కు సాయిప్రణీత్‌ గుడ్‌బై

Latest News

More Articles