Sunday, May 5, 2024

స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలంటూ కేసీఆర్ ముందు కాంగ్రెస్ మంత్రులు

spot_img

అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి డీ శ్రీధర్‌బాబు మంగళవారం కోరారు. యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుపరిపాలన అందించేందుకు అనుభవాన్ని అందించాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు.

త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలన్నారు. స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. అందరం కలుపుకొని తాము ముందుకుసాగుతామని హామీ ఇచ్చినట్లు మంత్రులు పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడుతుందని, రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
స్పీకర్‌ నామినేషన్‌కు హాజరవనున్న కేటీఆర్‌

శాసన సభ స్పీకర్‌ ఎన్నికకు వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు హాజరవనున్నారు. స్పీకర్‌ ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కేసీఆర్‌ను కోరిన నేపథ్యంలో.. నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరవుతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Latest News

More Articles