Thursday, May 9, 2024

బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి  కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని, ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామని.. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో వారు పార్టీ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతుందని ఆక్షేపించారు.

గత పది సంవత్సరాలలో లక్షలాదిమందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతుంది. పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉన్న, ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతులను సైతం రద్దు చేస్తున్నది. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలు ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. దీంతోపాటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాదిమంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని  తప్పు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డిడి లు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలని సూచించారు.

దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నది. ఎన్నికల్లో దళిత బంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు దళిత బంధు ప్రకారం 10 లక్షలైనా ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 12 లక్షల రూపాయలైనా వెంటనే అందించాలి. దళిత బందుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలి. ఒకవైపు పేదలకు ఉపయుక్తంగా ఉండే గృహలక్ష్మిని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బడుగు బలహీన వర్గాల తో పాటు దళిత సమాజానికి అండగా నిలబడిన గొర్రెల పంపిణీ, దళిత బందు కార్యక్రమాన్ని రద్దు చేయడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు.

ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. సంక్షేమ కార్యక్రమాల అమలుపైన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను పార్టీ తరఫున చేపడుతాము. లబ్ధిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయడం కాకుండా… గత ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నది. మునిసిపాలిటీలకు టియుఎఫ్ఐడిసి మరియు ఇతర సంస్థల ద్వారా శాఖ ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరిని రద్దు చేస్తున్నది. ఇప్పటికే ఈ నిధుల కు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కూడా అయింది. రోడ్లు, భవనాలు, ఇతర పౌరవసతుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు.

పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్ల మంజూరు ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ వెళుతున్న తీరు పైన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్, హరీష్ రావులు దిశానిర్దేశం చేశారు.

Latest News

More Articles