Saturday, April 27, 2024

ఉద్యోగులు అందుకు సిద్ధమై వస్తే.. వారంలో పదోన్నతులు.. నాది హామీ

spot_img

హైద‌రాబాద్ : ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులకు సిద్దం కావాలని సూచించారు. ఉద్యోగులు సిద్ధమై వస్తే వారంలో పదోన్నతులు ఇచ్చే బాధ్యత తమది అని స్ప‌ష్టం చేశారు. ఆర్థికశాఖ నుండి వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఉంటుంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు చెప్పారు.

అబిడ్స్ రెడ్డి హాస్టల్‌లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, వ్యవసాయ డైరీ, క్యాలెండర్‌ను వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. 2006 నుండి పదహారేళ్లుగా వ్యవసాయ ఉద్యోగుల డైరీని ఆవిష్కరిస్తున్నానని తెలిపారు. రాష్ట్రం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ ఉద్యోగుల సలహాలు తీసుకున్నారు. వారి సూచనలు, సలహాల ఆధారంగా వచ్చినవే తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయరంగ పథకాలు అని మంత్రి తెలిపారు.

వ్యవసాయ రంగ స్వరూపం ఎనిమిదేళ్లలో సంపూర్ణంగా మారిపోయిందని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింద‌ని గుర్తు చేశారు. ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్న ఏకైక పథకం రైతు బంధు .. ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు జమ చేశామ‌ని తెలిపారు.

కాళేశ్వరంతో భీడు భూములను సస్యశ్యామలం చేశాం. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయడంతో చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. భూగర్భ జలాలు తెలంగాణ వ్యాప్తంగా పెరిగాయ‌ని తెలిపారు. పంట పొలాలను కాల్చకుండా, కేజీ వీల్స్‌తో రైతులు ట్రాక్టర్లతో రోడ్ల మీదకు రాకుండా, కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించేలా, సేంద్రీయ వ్యవసాయం పెంచేలా, పాడి, పశుసంపద పెంచేలా, ఆయిల్ పామ్ ప్రోత్సహించేలా వ్యవసాయ అధికారులు కృషిచేయాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు.

Latest News

More Articles