Saturday, April 27, 2024

పాలమూరులో పంటలు పండుతుంటే కొందరికి నచ్చట్లేదు

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరితోపాటు ఎమ్మెల్యే లు లక్ష్మారెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి,మహేష్ రెడ్డి,జైపాల్ యాదవ్,బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి,ఎమ్మెల్సీ లు కసిరెడ్డి నారాయణ రెడ్డి,దామోదర్ రెడ్డి,గోరేటి వెంకన్న,కార్పొరేషన్ చైర్మన్ లు ఇంతియాజ్, వాల్యనాయక్,ఆంజనేయులు గౌడ్,సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘14 రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇచ్చిన వాళ్లు వచ్చి ఇవాళ రోజూ నీళ్లిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అంటే కోపం రాకుండా ఉంటదా? మనిషిని దేవుడు పుట్టిచ్చిండు. కాని మనిషి కులాన్ని పుట్టించిండు. దేవుడు కులాన్ని పుట్టియ్యలేదు. కులం కాదు గుణం ముఖ్యం.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలతో ఉద్యమించిన చరిత్ర శ్రీనివాస్ గౌడ్ ది. కులపిచ్చి, మత పిచ్చి వాళ్లను పట్టించుకోవడం లేదు. అభివృద్దే మన కులం, సంక్షేమమే మన మతం. జన హితమే మన అభిమతం అన్న ధృక్ఫథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలందర్ని కడుపున పెట్టుకుని చూసుకుంటున్నరు.

పల్లెపల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, సేతానం ఏడుందిరా సేలన్నీ బీళ్లాయరా… నెర్రెలు బారిన నేలలు, నెత్తురు పారిన నేలలు అంటూ ఆనాడు పాలమూరు దుస్థితిపై కవులు పాటలు రాసేవాళ్లు.

తెలంగాణ వచ్చిన ఈ 9 ఏళ్లలో ఏం మారింది అంటే ఆనాడు పాలమూరు అంటే మైగ్రేషన్ ఈనాడు పాలమూరు అంటే ఇరిగేషన్. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కొత్త చరిత్ర. గోదావరి, కృష్ణ జీవ నదులతో జీవం లేని పాలమూరుకు జీవం పోసినం. పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు మండుతున్నయ్. కడుపు మండుతున్నది.

ప్రతీ ఏటా 15 లక్షల మంది పాలమూర ప్రజలు వలసపోయేవాళ్లు. కాని ఇప్పుడు సీన్ మారింది. వేరే రాష్ట్రాల ప్రజల ఇక్కడికి వలస వస్తుంటే కొంతమందికి నచ్చడం లేదు. తిన్నది అరగడం లేదు.  పాలమూరులోని ఏ నియోజకవర్గంలోనూ నీళ్లు లేని దుస్థితి లేదు. లేబర్ పనుల కోసం ఒకనాడు పొట్ట చేతబట్టుకుని దేశంలో ఎక్కడెక్కడికో పాలమూరు కూలీలు వలసపోయేవాళ్లు. కాని ఇవాళ ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నరంటే ఇది పాలమూరు ప్రగతి కాదా?

ఆనాడు ఉన్న బీడు భూములు ఇవాళ మాగాణాలు అవుతున్నాయి? పాలమూరులో పంట రాశులు పండుతున్నాయి.నాడు ఎక్కడ చూసిన కరువు, కన్నీళ్లు. ఇవాళ ఎక్కడ చూసిన చెరువులు, నీళ్లు.ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నయ్.

కే అంటే కాలువులు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి. వ్యవసాయాన్ని పండుగ లా మార్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. తెచ్చుకున్న తెలంగాణ ఎంత బాగుందో అని చెప్పడానికి పాలమూరే సాక్ష్యం.

ఒకనాడు పాలమూరు వలసబతుకుల గడ్డ. కాని ఇవాళ పరిశ్రమల అడ్డ. ఇండస్ట్రీల ఖిల్లా. ఒకనాడు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే. కాని ఇవాళ జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉంది. తెలంగాణ వచ్చినంక పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులయ్యాయి. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ లతో మహబూబ్ నగర్ కు 33 టీఎంసీల నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.

బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అడుగుపెట్టిన మొదటి రోజే పాలమూరు రంగారెడ్డి పథకం మీద సమీక్ష చేసి మహబూబ్ నగర్ మీద తనకున్న ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకున్నారు. ఉద్దండపూర్ కరివెన , వట్టెం తో పాటు మరిన్ని రిజర్వాయర్ లతో ఉమ్మడి జిల్లాలోని పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకంతో 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మిషన్ కాకతీయ తో జిల్లాలో 1572 చెరువులు బాగమయ్యాయి.

932 కోట్లతో రోజూ ఇంటింటికి తాగునీరు ఇస్తున్నం. 5279 డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ. ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మీతో 3 లక్షల రూపాయలు ఇస్తాం. మహబూబ్ నగర్ జిల్లాలో 2 లక్షల మంది అన్నదాతలకు 10 విడతల్లో 1900 కోట్ల రూపాయలు రైతుబంధుతో ఇచ్చాం. మహబూబ్ నగర్ జిల్లాలోని 3653 రైతు కుటుంబాలకు రైతు బీమాతో 182 కోట్ల రూపాయాలు ఇచ్చాం.

2014 కు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో 73 వేల మందికి పెన్షన్ లు ఇస్తే లక్షా 6 వేల మందికి పెన్షన్ లు ఇస్తున్నాం. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నం.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణం అద్భుతంగా మారింది.

హైదరాబాద్ అవతల ఒక్క మహబూబ్ నగర్ లోనే శిల్పారామం ఉంది. టూరిజం డెవలప్ మెంట్ కోసం 26 వేల ఎకరాల్లో జంగల్ సఫారీని ప్రారంభించబోతున్నాం. కేసీఆర్ వయసు, స్థాయి గౌరవించాలన్న సంస్కారం లేని నీచుడు రేవంత్ రెడ్డి.

55 ఏళ్లు దేశాన్ని పాలించింది కాంగ్రెస్సే. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చెయ్యలేదు కాంగ్రెస్. కరెంటు, మంచినీళ్లు,సాగునీరు ఇవ్వలేని అసమర్థతకు కారణం కాదన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సక్కగ పనిచేస్తే ఇవాళ తెలంగాణలో సమస్యలు ఉండేవి కావు. 55 ఏళ్లలో కాంగ్రెస్ తెచ్చిన దరిద్రాన్ని ఏడెనిమిదేళ్లలోనే మంచిగ చేయమంటున్నరు.

బీజేపి రాష్ట్ర అధ్యక్షున్ని మంచోడు అనాలో, పిచ్చోడు అనాలో తెలియడం లేదు. 2014 లో జన్ ధన్ ఖాతాలు తెరిస్తే 15 లక్షలు ఇస్తమన్నడు మోడీ. కాని ఒక్క రూపాయి ఇవ్వలేదు. 15 లక్షలు ఇస్తమన్న మోడీ ఒక దిక్కు.. 15 లక్షల మంది పిల్లలు వలస పోకుండా ఆపిన కేసీఆర్ ఒక దిక్కు ఉన్నడు. ఆలోచించి ఓటెయ్యండి. ఆగం కాకండి.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తమని బీజేపీ నేతలు చెప్పి ముఖం చాటేస్తున్నరు. కృష్ణ నదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను పంచేందుకు కూడా మోడీకి టైం లేదు. సిలిండర్ ధర 400 రూపాయలు ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ ను మోడీ 400 సార్లు తిట్టిండు. మరి ఇప్పుడు సిలిండర్ ధర 1200 చేసిన మోడీని ఆడబిడ్డలు జాడిచ్చి తన్నాలి. ఈడ్చి కొట్టాలి. బీజేపీ పార్టీని బండకేసి కొట్టాలి.

పెద్దనోట్ల రద్దుతో పేదల నడ్డి విరిచిండు మోడీ. నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తమన్నడు. 2 కోట్ల ఉద్యోగాలిస్తమన్నడు. పెట్రోల్, డిజిల్ ధర తగ్గిస్తమన్నడు. ఇవేం చేయ్యని మోడీ దేవుడు అని బండి సంజయ్ అంటున్నడు. అదానీకి మాత్రమే మోడీ దేవుడు. ప్రపంచ కుబేరుల లిస్ట్ లో 603 ప్లేస్ లో ఉన్న అదానీ, మోడీ పుణ్యమా అని నెంబర్ 2 ప్లేస్ కు వచ్చిండు.

రైతుల ఆదాయాన్ని డబుల్ చెయ్యని మోడీ అదానీ ఆదాయాన్ని లక్ష రెట్లు పెంచిండు. అదాని సంపాదన నుంచి బీజేపీ చందాలు తీసుకుని అడ్డమైన దందాలు చేస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర లో ఎమ్మెల్యేలను కొని పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తరు. ఇదీ దిక్కుమాలిన నరేంద్రమోడీ పరిపాలన.

గుజరాత్ వాళ్ల చెప్పులు మోసే గుజరాతీ గులాములు ఇవాళ రాష్ట్ర బీజేపీలో ఉన్నరు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహల్ చోస్కీ లాంటి బ్యాంక్ ఎగవేత దారులకు సద్దులు కట్టి వాళ్లు దోచుకున్న పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోడీ కావాలా? 14 లక్షల పేద ఆడపిల్లల పెండ్లిల్లు చేసిన మేనమామ కేసీఆర్ కావాల్నో పాలమూరు ప్రజలు ఆలోచించుకోవాలి.

కర్నాటకలో జై బజరంగ్ బళి అంటున్నరు. ఎన్నికల సమయంలోనే బీజేపీకి దేవుడు గుర్తుకొస్తడు. వాళ్లు దేవున్ని కూడా మోసం చేస్తరు. దిక్కుమాలిన పార్టీలకు అవకాశం ఇస్తే మళ్లీ నెత్తురు కారే పరిస్థితులు తీసుకొస్తరు. మతం మంటల్లో ఉండే తెలంగాణ కావాలో, పచ్చని పంటలతో ఉండే తెలంగాణ కావాలో రైతులు, యువత తేల్చుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ ను కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత పాలమూరు ప్రజలదే.’’ అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles