Thursday, May 9, 2024

ఈవీపై ఇన్సెంటీవ్ తగ్గింపు పర్యావరణానికి గొడ్డలిపెట్టు.. నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

spot_img

హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఇన్సెంటీవ్ తగ్గిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పర్యావరణ పరిరక్షణ చర్యలకు గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్ పై రూ.15,000 ఇన్సెంటీవ్ ఉండేదని.. కానీ దాన్ని రూ.10,000కు తగ్గించారన్నారు. ఇప్పటి వరకు వాహనంపై గరిష్టంగా 40 శాతం వరకు ఇన్సింటీవ్ కు అవకాశం ఉండేదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పుడు గరిష్టంగా రూ.10వేలు లేదా వాహనధరలో 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం గెజిట్ ఇవ్వడం సరికాదన్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకున్న వారికి ఇబ్బందిగా మారిందన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకని FAME-2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానిఫ్యాక్చురింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) కేంద్రం తీసుకొచ్చిందని.. కానీ తీసుకుంటున్న చర్యలు మాత్రం ఈవీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. 2030 కల్లా దేశంలోని పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చూస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గొప్పలు చెప్పుకున్నారని గుర్తు చేశారు.

అలాగే.. ఫేమ్-2లో భాగంగా 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని వర్తింపచేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం..  ఆ లక్ష్యాన్ని చేరుకోకముందే ఇలా ఇన్సెంటీవ్ ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని.. ఇలాంటి సమయంలో ఇన్సెంటీవ్ లో కోత పెట్టడం వల్ల ప్రజలు ఈవీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేధన వ్యక్తంచేశారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు పెంచడంపైనా కేంద్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదని విమర్శించారు.

తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోందన్నారు సతీష్ రెడ్డి. ఈవీ పాలసీని తీసుకొచ్చి.. 2 లక్షల వాహనాలు ద్విచక్రవాహనాలు, 5000 వేల ఫోర్ వీలర్స్ , 500 బస్సులు, 20,000 ఆటోలకు రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందన్నారు.

ఈవీపై ప్రజల ఆసక్తిని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన 5000 ఫోర్ వీలర్స్ కు అదనంగా మరో 2 వేల ఈవీ ఫోర్ వీలర్స్ కు రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు ప్రకటించారన్నారు. ఒక రాష్ట్రమే ఇంతపెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం అంతకుమించిన సబ్సిడీలతో ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా సబ్సిడీల్లో కోతపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రపంచమంతా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహాన్ని ఇస్తోంటే.. మోడీ సర్కారు మాత్రం ఈవీ రంగం దెబ్బతినేలా వ్యవహరిస్తోందన్నారు. ఈవీతోపాటు సోలార్ పైనా ట్యాక్స్ ల భారం మోపిందన్నారు. సోలార్ పరికరాలపై జీఎస్టీని  5 శాతం నుంచి 12 శాతానికి పెంచిందన్నారు. సోలార్ పీవీ సెల్స్ దిగుమతిపై 25 శాతం, సోలార్ పీవీ మాడ్యూల్స్ దిగుమతిపై 40 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తోందన్నారు.

అలాగే.. రూఫ్ టాప్ సోలార్ ఒక కిలోవాట్ ప్లాంట్ కు గతంలో రూ.21,320 సబ్సిడీ ఉండేదని.. కానీ దాన్ని రూ.14,588 కు తగ్గించారన్నారు. పునరుత్పాధక శక్తి వాడకాన్ని పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తిగా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు.

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే చర్యల్లో భాగంగా 2030కల్లా కర్బన ఉద్గారాలను 45 శాతం వరకు తగ్గించాలని, 2050 కల్లా పూర్తిగా కర్బన ఉద్గారాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచదేశాలు నిర్ణయించాయన్నారు. ఆ దిశగా చర్యలు కూడా చేపడుతున్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే చర్యలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. భావి తరాలు బాగుండాలంటే పునరుత్పాధక శక్తికి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Latest News

More Articles