Wednesday, May 1, 2024

ప్రారంభమా.. పట్టాభిషేకమా.. ప్రధాని మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు

spot_img

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్‌సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై కనిపించారు. రాష్ట్రపతితో పాటు రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.

మోదీ కార్యక్రమాన్ని జరిపించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశాన్ని శాస్త్రీయ దృక్పథంతో కూడిన ఆధునిక భారతదేశ నిర్మాణం గురించి ప్రయత్నిస్తే.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. అసహనంతో నిరంకుశ శక్తులు విజృంభిస్తున్నాయని, అసమ్మతిని అణచివేస్తున్నారని బెంగాల్ సీఎం మమత ధ్వజమెత్తారు.

మొదటి రోజే రాజదండం వంగిపోయింది

మరోపక్క శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజర్లను ఈడ్చేసి అరెస్ట్‌ చేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తప్పుబట్టారు. మొదటి రోజే రాజదండం వంగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని, కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం రోజున.. రెజ్లర్లపై ఇలాంటి చర్యలు సిగ్గుచేటు, బాధాకరమని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ అన్నారు.  రెజ్లర్లపై దాడి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిందా? దీనికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు.

రాష్ట్రపతికి అవమానం.. గిరిజనుల నిరసన

పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ రాంచీలో కాంగ్రెస్‌, సీపీఐతో పాటు పలు గిరిజన సంఘాలు నిరసన చేపట్టాయి. మోదీ రాజ్యాంగాన్ని అవమానించారని గిరిజనులు నినాదాలు చేశారు.

విపక్ష పార్టీలు దూరం

కాగా, పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఆప్‌, టీఎంసీ, డీఎంకే ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్‌ వర్గం) సహా పలు ప్రధాన విపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

Latest News

More Articles