Thursday, May 2, 2024

సారున్నప్పుడే సక్కగుండేది.. రైతుబంధుపై రైతన్న ఆవేదన

spot_img

కేసీఆర్‌ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్‌ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస్తలేదు. రైతు బంధు వస్తేనే వరినాటు వేస్తా సారు’ అంటూ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం మంగపేటకు చెందిన దళిత రైతు లింగాల నర్సయ్య ఆవేదన వెలిబుచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో మధురానగర్‌ సమీపంలో మాజీ ఎంపీ వినోద్‌ తన వాహనాన్ని ఆపారు. వినోద్‌ను చూసిన దళిత రైతు నర్సయ్య దగ్గరికి వచ్చి తన వ్యవసాయ పొలం చూడాలని కోరాడు. నర్సయ్య కోరిక మేరకు పొలం వద్దకు వెళ్లిన వినోద్‌కుమార్‌.. ‘వ్యవసాయం ఎలా సాగుతున్నది’ అని అడిగారు.

Telangana Former Says When KCR was CM Rythu Bandhu Scheme Was Perfect

‘వడ్ల పైసలతో పొలం దున్ని, విత్తనాలు తెచ్చి నారుపోసిన. ఇప్పుడు వరి నాటుకు వచ్చింది. నాటు వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. నారు ముదురుతున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు బంధు పైసలు వస్తాయని ఆశగా చూస్తున్నానని, రెండు రోజులకోసారి బ్యాంకుకు వెళ్లి ఖాతాలో డబ్బులు పడ్డయో లేదో చూసి వస్తున్నానని, ఇంతవరకు రైతుబంధు పైసలు పడలేదని వాపోయాడు. అందుకే నాటువేసేందుకు వెనుకడుగు వేస్తున్నానని చెప్పిన రైతు.. కేసీఆర్‌ సారు ఉన్నన్ని రోజులు రెండు పంటల పెట్టుబడికి రంది లేకుండెనని, నాటు వేసే సమయానికి రైతుబంధు పైసలు పడేటియని, కాం గ్రెస్‌ ప్రభుత్వంతో రైతుల బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని వివరించాడు. వినోద్‌ వెంట కొడిమ్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ మెన్నేని రాజనర్సింగరావు, నాయకులు సంపత్‌ ఉన్నారు.

Latest News

More Articles