Thursday, May 2, 2024

ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌

spot_img

ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ మొత్తం ఆధిక్యం 296 పరుగులకు చేరింది. ప్రస్తుతం క్రీజ్‌లో కామెరూన్ గ్రీన్ (7 నాటౌట్), మార్నస్‌ లబుషేన్ (41 నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్ తలో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 469 పరుగులు చేయగా.. భారత్‌ 296 పరుగులకు ఆలౌటైంది.

భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోని తొలివికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్ (1)ను సిరాజ్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (13)  కొద్దిసేపు పోరాడినా.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ – స్మిత్ (34) తో కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని జడేజా విడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ట్రావిస్‌ హెడ్‌ (18)ను కూడా జడేజా సూపర్‌ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపించాడు.

రహానె – శార్దూల్ హాఫ్ సెంచరీలు

ఓవర్‌ నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజును ప్రారంభించిన భారత్‌కు రెండో బంతికే షాక్‌ తగిలింది. శ్రీకర్ భరత్‌ (5)ను స్కాట్‌ బోలాండ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, రహానె (89) – శార్దూల్ ఠాకూర్ (51) హాఫ్‌ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, రెండో సెషన్‌ ప్రారంభం తర్వాత రహానె ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత వికెట్లు త్వరితంగా పడిపోయాయి.

హైడ్రామా

స్టార్క్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ను ఎల్బీగా అంపైర్‌ ప్రకటించాడు. అయితే, సిరాజ్‌ వెంటనే డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అప్పటికే ఆసీస్‌ ఫీల్డర్లు డగౌట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, సమీక్షలో నాటౌట్‌గా తేలడంతో ఆసీస్‌ ఆటగాళ్లు నిరాశగా వెనక్కి వచ్చారు. అయితే, ఇదే ఓవర్‌ నాలుగో బంతికి షమీ (13) ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  ఆసీస్‌ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 3, స్టార్క్ 2, బోలాండ్ 2, గ్రీన్ 2, లైయన్ ఒక వికెట్ తీశారు.

Latest News

More Articles