Wednesday, May 1, 2024

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై.. అప్పు తీర్చేందుకు కన్నతల్లినే చంపిన కొడుకు

spot_img

ఆన్‌లైన్ గేమింగ్స్ కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరుతో ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు ఓ తనయుడు.

ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో జరిగింది. నిందితుడిని హిమాన్షుగా గుర్తించారు. గేమింగ్‌లో నష్టాల కారణంగా అప్పులపాలు కావడంతో, వీటిని తీర్చేందుకు తన అత్త ఇంటి నుంచి నగలు దొంగిలించి, వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తల్లిదండ్రుల పేరుతో రూ.50 లక్షలకు జీవిత బీమా చేయించాడు. ఈ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు తల్లి ప్రభను చంపేశాడు. హిమాన్షు జూపీ అనే యాప్‌లో ఆన్లైన్ గేమింగ్‌కి బానిస అయినట్లు తేలింది. దీంతో రూ. 4 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. అప్పులు తీర్చాలని స్నేహితుల నుంచి ఒత్తిడి రావడంతో తల్లిని చంపాడు.

తండ్రి రోషన్ సింగ్ చిత్రకూట్ ఆలయాన్ని సందర్శించేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో, హిమాన్షు తన తల్లి ప్రభ గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని జూట్ సంచిలో పెట్టుకుని, ట్రాక్టర్‌పై తీసుకెళ్లి యుమునా నది ఒడ్డున పారేశాడు. తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య, కొడుకు హిమాన్షు కనిపించలేదు. అయితే, నదికి సమీపంలో ట్రాక్టర్‌పై హిమాన్షను చూసినట్లు స్థానికులు చెప్పడంతో, ఆరా తీయగా షాకింగ్ విషయం బయటపడింది.

ఫిబ్రవరి 21న ప్రభ మృతదేహాన్ని వెలికితీసి, హిమాన్షును అరెస్టు చేశారు. అప్పులు తీర్చడానికి అతను వేసుకున్న ప్లాన్ గురించి పోలీసులకు తెలిపాడు. తల్లిని హత్య చేసిన తర్వాత పరారీలో ఉన్న హిమాన్షను పోలీసులు పట్టుకున్నారు. తన బంధువుల నగలు దొంగిలించిన విషయం తెలియడంతో తల్లి తిట్టిందని.. అతడిని నగలు వెనక్కి ఇవ్వాలని చెప్పులతో కొట్టినట్లు, అందుకే తల్లిని హత్య చేసి అప్పులు తీర్చాయాలని అనుకున్నట్లు హిమాన్షు పోలీసుల విచారణలో తెలిపాడు.

ఇది కూడా చదవండి: డ్రైవర్‌ లేకుండానే 78 కి.మీ. ప్రయాణించిన రైలు

Latest News

More Articles