Sunday, May 5, 2024

‘మహా’ పార్టీల కిందకు బీఆర్ఎస్ నీళ్లు

spot_img

మహారాష్ట్ర రాజకీయపార్టీల నేతల కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుం టే నిజమేననిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాగ్‌పూర్‌లో రాజేసిన దేశపరివర్తన మంటలు మహారాష్ట్ర రాజకీయాల్లో దావానంలా విస్తరిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడాలేకుండా మహారాష్ట్రలోని సకల పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. క్యూకట్టి మరీ గులాబీ గూటికి చేరుతున్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రబలమైన శక్తిగా అవతరిస్తుందని అక్కడి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయ పార్టీల పీఠాల కిందికి నీళ్లు
సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కా ర్‌’ నినాదం మహారాష్ట్ర రైతాంగాన్ని, సాధారణ ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. ప్రజాభీష్టానికి అనుగుణంగా మహారాష్ట్రలోని అధికార శివసేన, ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 2, బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఆప్‌, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన సహా పలు పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ పరిణామాలతో మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌స్థాయి దాకా అన్నిపార్టీల్లోని క్యాడర్‌ అంతా బీఆర్‌ఎస్‌లోకి రావటంతో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీలు క్యాడర్‌ను కోల్పోతున్నాయి. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను కట్టడి చేయాలని ఉమ్మడి వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్‌ను వేరు చేయలేరని, ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న బీజేపీకి సీఎం కేసీఆర్‌ నాగ్‌పూర్‌ కేంద్రంగా దీటైన జవాబిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నట్టింట్లో నిలబడి దేశపరివర్తన శంఖారావం పూరించేసరికి బీజేపీకి కాలూచేయి ఆడని పరిస్థితి ఎదురైంది. బీజేపీకి కేసీఆర్‌ వ్యూహం అంతుచిక్కక అయోమయ పడుతున్నది.

ఎన్సీపీయే బీజేపీ బీ-టీం: మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌
మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీయే బీజేపీకి బీ-టీం అని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ది రైతు, యు వత, మహిళా టీం అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీ బీ-టీం అని శరద్‌పవార్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని చేలాయించిన సందర్భాన్ని మహారాష్ట్ర ప్రజలు మరచిపోరని, ఎన్సీపీయే బీజేపీకి బీ-టీం అని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌ కదం వెల్లడించారు. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అనేక సార్లు పనిచేసిన శరద్‌పవార్‌ బీజేపీ ఆపదలో ఉన్న ప్రతీసారి ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రధాని మోదీతో కలిసి బారామతిలో సమావేశమైన సందర్భాన్ని ఎత్తిచూపారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయబోతున్నదని, రైతులు, యువకులు, మహిళలు సహా సామాన్యప్రజలు తెలంగాణ మాడల్‌ కోసం పరితపిస్తున్నారని గ్రహించే శరద్‌పవార్‌ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంగ్డే పేర్కొన్నారు.

Latest News

More Articles