Friday, May 10, 2024

ఆర్బీఐలో 88 వేల కోట్ల రూ. 500 నోట్లు పోయినయ్

spot_img

మన ఆర్బీఐ డబ్బులు పోగొట్టుకున్నది. అవును.. మీరు చదివింది నిజమే. దేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు, నోట్ల కట్టలు కాదు.. నోట్ల గుట్టలనే పోగొట్టుకున్నది. వీటి విలువ అక్షరాలా రూ.88,032 కోట్లు. యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వ్యవహారం ఆరేండ్లుగా బయటపెట్టలేదు. ఒక ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుతో బయటకు వచ్చింది. మింట్‌ కాంపౌండ్‌లలో ప్రింట్‌ అయిన నోట్లు ఆర్బీఐకి చేరలేదనే విషయం బయటపడింది. ఈ ఘటన బీజేపీహయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది.

నోట్ల ముద్రణకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ చేసిన దరఖాస్తులో ‘నోట్ల గల్లంతు’ వ్యవహారం బయటపడింది. మొత్తం మూడు నోట్ల ముద్రణాలయాల్లో 881.065 కోట్ల సంఖ్యలో కొత్త రూ.500 నోట్లు ముద్రితమైతే రిజర్వు బ్యాంకు మాత్రం 726 కోట్ల సంఖ్యలో మాత్రమే అందుకున్నది. మిగతా 176 కోట్ల సంఖ్యలో రూ.500 నోట్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. వీటి విలువ రూ.88,032.5 కోట్లు. ఇలా కనిపించకుండా పోయిన నోట్లన్నీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా తీసుకువచ్చిన రూ.500 నోట్లు. 2016 – 17 మధ్యకాలంలో 519.565 కోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్లను ముద్రించి ఆర్బీఐకి పంపినట్టు బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ చెబుతున్నది.

ఇదే సమయంలో 195.3 కోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్లను ముద్రించి పంపామని దేవాస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌, 166.2 కోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్లు ముద్రించి ఆర్బీఐకి పంపామని నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ చెబుతున్నాయి. మొత్తం కలిపి 2016 – 17 మధ్య 881.065 కోట్ల సంఖ్యలో రూ.500 కోట్ల నోట్లను ఈ మూడు ముద్రణాలయాలు ఆర్బీఐకి పంపించామని చెబుతున్నాయి. కానీ, ఆర్బీఐ మాత్రం 726 కోట్ల సంఖ్యలో మాత్రమే రూ.500 నోట్లు తమకు అందినట్టుగా చెబుతున్నది. అంటే, 155.065 సంఖ్యలో రూ.500 నోట్లు ఆర్బీఐకి చేరలేదు. ఇవే కాకుండా, 2015 – 16లోనూ 21 కోట్ల సంఖ్యలో రూ.500 నోట్లను ముద్రించి ఆర్బీఐకి పంపినట్టు నాసిక్‌ ప్రెస్‌ చెబుతున్న నోట్లకు సంబంధించిన లెక్కలు కూడా నమోదు కాలేదు. అంటే, మొత్తంగా 176 కోట్ల సంఖ్యలో రూ.500 నోట్లు కనిపించకుండాపోయాయి.

మిస్టరీగా మారిన ఈ నగదు అదృశ్యం బీజేపీహయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థకున్న భద్రతాపరమైన డొల్లతనాన్ని నిరూపిస్తున్నది. ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదుపై విశ్వసనీయత సన్నగిల్లింది. ఇప్పుడు ఈ వ్యవహారం మన ఆర్థిక వ్యవస్థపై మరింత దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉన్నది. ఈ వ్యవహారంపై ఆర్బీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం వెలువడలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సెంట్రల్‌ ఎకనామిక్స్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఈడీకి మనోరంజన్‌ రాయ్‌ ఫిర్యాదు చేశారు.

Latest News

More Articles