Sunday, May 5, 2024

అమెరికాలో కొత్త రూల్స్: విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

spot_img

విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్‌ ఇచ్చేలా అమెరికా  ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు ఫీజుల బాదుడు నుంచి కస్టమర్లను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్‌ కార్యవర్గం తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్‌లను ఆటోమేటిక్‌గా చెల్లించాలి. క్రెడిట్‌ కార్డు ద్వారా సేవలు కొనుగోలు చేసిన వారికి ఏడు పనిదినాలు, ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి 20 రోజుల్లో రిఫండ్‌ చేయాలి. కొనుగోలు సమయంలో వారు ఏ రూపంలో ద్వారా చెల్లించారో అదే రూపంలో వారికి తిరిగివ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వోచర్లు, ట్రావెల్‌ కార్డులు ఇతరత్రా రూపంలో పరిహారం ఇవ్వడానికి వీల్లేదు. ప్రయాణికుడు విధిగా అభ్యర్థిస్తే మాత్రం వారు కోరుకున్న విధంగా ఇవ్వొచ్చు.

విమానయాన సంస్థలు, టికెట్‌ ఏజెంట్లు రిఫండ్‌కు ఎలాంటి కోత వేయొద్దు. ఏమైనా సేవలు వినియోగించుకొని ఉంటే దాని వరకు మాత్రమే ఛార్జ్‌ చేసి మిగిలిన మొత్తాన్ని వాపస్‌ చేయాలి. అలాగే లగేజీ, రిజర్వేషన్‌ మార్పు లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలి. తద్వారా ఎలాంటి రుసుములు చెల్లిస్తున్నారో కస్టమర్లకు అవగాహన ఉంటుంది. పైగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా చూపించాలి. ప్రత్యేక హైపర్‌లింక్‌ల రూపంలో ఇవ్వకూడదు.

లగేజీ బరువు, పరిమాణం.. వీటిని బట్టి విధించే ఛార్జీని విధిగా తెలుపాలి. రిజర్వేషన్‌ మార్పు, రద్దుకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా తెలియజేయాలి. కొన్ని సీట్ల కోసం మాత్రమే కేటాయింపు ఫీజు వసూలు చేస్తున్నప్పుడు.. అన్ని సీట్లకు దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు విధిగా అవగాహన కల్పించాలి. తద్వారా వారు అనవసరంగా ఆ ఫీజును చెల్లించకుండా ఉంటారు.

పలు సేవల పేరిట విమానయాన సంస్థలు అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయి. పైగా వాటిని ప్రయాణికులకు తెలియజేయడం లేదు. తీరా చెల్లింపులు చేసేటప్పుడు వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే విమానాల రద్దు, మార్గం మళ్లింపు సమయంలో ప్రయాణం రద్దు చేసుకొని రిఫండ్‌ కోరితే.. వివిధ ఛార్జీల పేరిట కొంత మొత్తాన్ని కత్తిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ చెక్‌ పెట్టడం కోసం అమెరికా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మెదక్, సిద్దిపేట కొత్త జిల్లాలు పోతాయి

Latest News

More Articles