Sunday, May 5, 2024

రాష్ట్రంలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్షం

spot_img

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతున్నది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి హనుమకొండ, వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడుతున్నది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

అకాల వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో వర్షం భారీ వర్షం కురుస్తున్నది. తిప్పర్తి, మిర్యాలగూడ, వేములపల్లి, చండూర్ మండలంలో భారీగా వర్షం కురుస్తున్నది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నాగారం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడడంతో చెట్టు పూర్తిగా కాలిపోయింది.

రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. దాంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నది. దాంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Latest News

More Articles