Sunday, May 5, 2024

నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లే పని రేవంత్‎కు వెన్నతో పెట్టిన విద్య

spot_img

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రేవంత్ అంగీకరిస్తేనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేంద్రం అప్పుగా ఇచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ రోజు ఆయన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యాభై రోజుల పైనే అయింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్‎ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అని సీఎం నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోడీని కేసీఆర్ ప్రశ్నించినంతగా ఎవరూ ప్రశ్నించలేదు. నిజామాబాద్ ఎంపీ, హుజురాబాద్ ఉపఎన్నికలలో కాంగ్రెస్-బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్‎ను ఓడించాయి. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. పీఎం మోడీని రేవంత్ కలిసినపుడు బీఆర్ఎస్‎ను ఫినిష్ చేద్దామని ప్రతిపాదించినట్టు ఓ పత్రిక రాసింది నిజం కాదా? బీఆర్ఎస్‎ను ఓడించేందుకు కాంగ్రెస్-బీజేపీలు కలిసి పనిచేయాలని బండి సంజయ్ పిలుపునివ్వలేదా? వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రేవంత్ అంగీకరిస్తేనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేంద్రం అప్పుగా ఇచ్చింది.

Read Also: మాణిక్కం ఠాకూర్‎పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. నోటీసులు ఎవరికి పంపాలో తెలియడం లేదా?

కేసీఆర్ తన హయాంలో రైతుల శ్రేయస్సు కోసం మీటర్లు బిగించే ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. ప్రముఖులపై నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లే పని రేవంత్‎కు వెన్నతో పెట్టిన విద్య. రైతులు ఆందోళనతో ఉన్నారు.. వారి బాధలు రేవంత్‎కు పట్టడం లేదు. కేటీఆర్, హరీష్ రావులను బిల్లా-రంగాలతో రేవంత్ పోల్చడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడ్డ నేతలను హంతకులతో పోల్చడం సీఎం పోస్టులో ఉన్న వ్యక్తికి చెల్లుతుందా? వంద రోజుల్లో గ్యారంటీల అమలు అన్నారు.. ఇపుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అమలు అంటున్నారు.. ఎన్నిసార్లు మాట మారుస్తారు? ఒక ఎన్నికలో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ చచ్చిపోయింది అంటావా? అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, అహంకారం తగదు. బీఆర్ఎస్‎కు ఓటేస్తే మూసీలో వేసినట్టే అని సీఎం అనడం ఓటర్లను అవమానించడమే. కాంగ్రెస్ దేశంలో ఎక్కడుంది.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ గౌరవించింది. అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నాం, మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలి? ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఈ ప్రభుత్వం పంటలకు విడుదల చేయక ఎండబెడుతుంది. కేసీఆర్‎ను బద్నాం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం, మంత్రులకు పాలన చేత కాక అనవసర విషయాలు తెరపైకి తెస్తున్నారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టి ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలి’ అని కొప్పుల ఈశ్వర్ సూచించారు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ విమర్శలను ఖండిస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పనులు కాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఎలా ఇస్తున్నారు? కేసీఆర్ హయాంలోనే స్టాఫ్ నర్సుల భర్తీ జరిగింది. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తుంది. కేటీఆర్ ప్రజల పక్షాన మాట్లాడితే కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఒక్క నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విమర్శలను మూటగట్టుకుంది. తమది వందేళ్ల పైబడ్డ పార్టీ అని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు.. మరి కుదురుకోవడానికి ఇంకెంత సమయం కావాలి? రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

Latest News

More Articles