Friday, May 10, 2024

కెనడాలో ఉన్న భారతీయులను అలర్ట్ చేసిన కేంద్రం

spot_img

కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు, భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ఆమోదంతో నేరాలు, హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. భారత్‌లోని కెనడా పౌరులకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలే చెప్పిన మరుసటి రోజే కేంద్రం ఎన్నారైలకు ఈ సూచనలు చేసింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ‘ఎక్స్’ వేదికగా కెనడాలోని ఎన్నారైలను ఈ మేరకు హెచ్చరించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించే భారతీయ దౌత్యవేత్తలు, భారతీయులకు బెదింపులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి, గతంలో అలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అయితే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలు స్థానిక అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎన్నారైల భద్రత కోసం కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.

జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని.. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆరోపించారు. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్న దానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌ను రెచ్చగొట్టడం లేదన్న ఆయన, నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

Latest News

More Articles