Monday, May 6, 2024

నేటి నుంచి గులాబీ బాస్ రోడ్ షో.. మిర్యాలగూడ నుంచి ప్రారంభం.!

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం నుంచి లోకసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రైతుల కోసం,రాష్ట్రం కోసం 17రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి , 12లోకసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. లోకసభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తారు.

స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తొలిరోజు కేసీఆర్ మిర్యాలగూడ, సూర్యపేట రోడ్ షోలలో పాల్గొంటారు. అంతకుముందు బుధవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి..అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతారు. కేసీఆర్ తొలుత నల్లగొండ జల్లా మిర్యాలగూడకు చేరుకుని..అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యపేటకు వెళ్లి..అక్కడ కూడా రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం భువనగిరికి చేరుకుని..సాయంత్రం రోడ్ షోలో పాల్గొంటారు.

అక్కడి నుంచి ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేయనున్నారు. కాగా గులాబీ బాస్ ప్రయాణించే బస్సులు అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెలంగాణభవన్ లో బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు 100మందికిపైగా వాలంటీర్లు వెన్నంటి ఉంటారు. ఉద్యమ నాయకుడిగా పాదయాత్ర,సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా బస్సుయాత్ర చేపట్టారు.

ఈ నేపథ్యంలో బస్సుయాత్రను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం, సరియైన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో మోటర్లు కాలిపోతుండటం,ధాన్యానికి రూ. 500 బోనస అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్ దారులకు రూ.4వేలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతినెలా రూ. 2,500 హామీని అమలు చేయకపోవడం ఇలాంటి కాంగ్రెస్ ప్రభు్తవ వైఫల్యాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు.

ఇది కూడా చదవండి: జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.!

Latest News

More Articles