Saturday, April 27, 2024

కేటీఆర్ కీలక కామెంట్స్.. ORR, RRRకి మధ్యలో కొత్త హైదరాబాద్

spot_img

కాంగ్రెస్‎లో 11 మంది సీఎంలు తయారుగా ఉన్నారని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు కాదు ఆర్నెళ్లకో సీఎం మారుతారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బంజారాహిల్స్ తాజ్ దక్కన్‎లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పీర్జాదిగూడా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, టీబీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘29 మే, 2014న ఇక్కడే మనం సమావేశమయ్యాం. ఆ రోజు హైదరాబాద్‎లో ఎవరూ భూములు అమ్మకండి.. కుదిరితే కొనండి అని మీరన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు భూముల ధరలు పదిరెట్లు పెరిగాయి, కొన్ని చోట్ల 20 రెట్లు కూడా పెరిగాయి. తెలంగాణలో ఏ రైతుని అడిగినా ధీమాగా, ధైర్యంగా చెబుతాడు. నాకేమైన నా కుటుంబానికి డోకా లేదని అంటున్నారు.. ఇదంతా భూముల ధరలు పెరగడం వల్లే. తెలంగాణ వచ్చాక భూముల ధరలు పెరిగాయని చంద్రబాబు నాయుడు సైతం చెప్పారు. అనేక రంగాల్లో దేశంలో తెలంగాణ నేడు ఆదర్శంగా నిలిచింది. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన న్యాయకత్వం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. అసాధారణ విజయాలు సాదించాం. తొమ్మిదిన్నర ఏళ్లలో రెండేళ్లు కోవిడ్‎కి పోయింది, దాంతో లక్ష కోట్ల నష్టం వచ్చింది. నికరంగా మేం పనిచేసింది ఆరున్నర ఏళ్ళు మాత్రమే. మాకంటే ముందు అరవై ఏళ్లు ఎవరు పాలించారో మీకు తెలుసు, వారి పాలన ఎలా ఉందో చూశారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని మేం చెప్పడం లేదు. అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు అంతం అవ్వవు.. కొత్తవి వస్తూనే ఉంటాయి, వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. 65 ఏళ్ళల్లో 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్లు పరిపాలించారు. వాళ్ళు ఇలాగే పనిచేస్తే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. పదేళ్ల కింద హైదరాబాద్‎లో కరెంట్ సమస్యలు ఎక్కువ ఉండేవి. పదేళ్ల కింద కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకులను మార్చాలిసిన అవసరం ఏముంది? ఒక్క చాన్స్ అని వస్తున్నారు.. 11 ఛాన్స్‎లిచ్చినప్పుడు ఏం చేశారు? అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు.

మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది
తలసారి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‎గా నిలిచింది. తెలంగాణ వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కర్ణాటకలో పాత ప్రభుత్వం 40 శాతం వసూలు చేస్తే.. ప్రభుత్వాన్ని మార్చారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 400 శాతం వసూలు చేస్తున్నారట. మన దగ్గర టీఎస్ బీ పాస్ తెచ్చాం.. డిసెంబర్ 3 తర్వాత ఇంకా మార్పులు చేస్తాం. నాలాల విషయంలో సూచనలు చేశాం, ఎన్నికల కోడ్ వచ్చింది. అది పోగానే ఆ సమస్యలు కూడా తీరుస్తాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకుందాం. హైదరాబాద్ అభివృద్ధిలో మీరు చూసింది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది. మొదటగా నీళ్లకు ప్రాధాన్యం ఇచ్చాం, తెలంగాణ సస్యశ్యామలం అయింది. తాగు నీరు, సాగునీరు, పవర్ మీద దృష్టి పెట్టాం.

ORR, RRRకి మధ్యలో కొత్త హైదరాబాద్
హైదరాబాద్ చుట్టూ 332 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ORR, RRRకి మధ్యలో కొత్త హైదరాబాద్ ఆవిష్కృతమవుతుంది. హైదరాబాద్‎లో ప్రతి రోజూ నీళ్లు ఇచ్చేలా చేస్తాం. రాబోయే రోజుల్లో 24 గంటలు నీళ్లు ఇవ్వలన్నది నా కల. ఐటీ ఉద్యోగుల సంఖ్య పదిలక్షలకు పెరిగింది. 1989లో బేగంపేటలో మొదటి ఐటీ కంపెనీ వచ్చింది. 25 ఏళ్లలో ఐటీ ఎగుమతులు సున్నా నుండి 57 వేల కోట్లకు పెరిగింది. 2022 నుండి 2023 మధ్యలో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు. 25 ఏళ్లలో చేయని 57 వేల కోట్ల ఎగుమతులను కేవలం ఒక్క ఏడాదిలో సాధించాం. కాంగ్రెస్‎లో 11 మంది సీఎంలు తయారుగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలు కాదు ఆర్నెళ్లకో సీఎం మారుతారు. కాంగ్రెస్‎లో కొత్తదేముండదు.. కొత్త సీసాలో పాత సారా మాత్రమే. తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్.. ఇక్కడ అభివృద్ధి మా కులం, సంక్షేమం మా మతం అంటూ ముందుకు వెళుతున్నాం. అందుకే ఇక్కడ ఇతర రాష్ట్రలతో పాటు ఇతర దేశాల కంపెనీలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయి. తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటివరకు మనకు ముగ్గురు సీఎంలు మాత్రమే గుర్తుకువస్తారు.. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ మాత్రమే. అన్ని రంగాల అభివృద్ధి కొరకు సీఎం కేసీఆర్ కృషి చేశారు. ఈ ఎన్నిక తెలంగాణను ఎవరు నడిపించాలి? ఎవరి చేతులో పెట్టాలి? అదే దానికోసం. చిన్న చిన్న తప్పులుండొచ్చు, కానీ మేం చూసిన అభివృద్ధిని చూసి, మంచి చేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి. మేం 36 ఫ్లై ఓవర్లు కట్టాం, కానీ కేంద్రం 2 ఫ్లై ఓవర్లు కట్టలేదు. హైదరాబాద్ ఓటింగ్ శాతం ప్రతిసారి తగ్గుతుంటుంది, దాన్ని పెంచాలి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్‎లో పాల్గొనాలి. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం.. ఇలాగే నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

More Articles