Monday, May 6, 2024

వాహనదారులకు గుడ్‎న్యూస్.. మరోసారి చలాన్లకు రాయితీ!

spot_img

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు శుభవార్త చెప్పారు. త్వరలో గతంలో మాదిరిగానే పెండింగ్ చలాన్లకు రాయితీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. దాంతో వాహనదారులకు భారీ రాయితీ లభించనుంది. ఈ విధంగానైనా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేయాలని పోలీసుశాఖ కసరత్తుచేస్తోంది. గత ఏడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్నతరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి, చలానాలు విధించడం సులభమైంది. అయితే చాలామంది చలానాలను చెల్లించడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి, వాహనం నంబరు ఆధారంగా దానిపై ఉన్న చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు బయటపడుతోంది. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్‌ భారం పెరిగిపోతోంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించనున్నారు.

Latest News

More Articles