Sunday, May 5, 2024

హైదరాబాద్‌లో సన్‌బర్న్‌ కార్యక్రమం రద్దు

spot_img

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించనున్న సన్‌బర్న్‌ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. బుక్‌మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై ఈవెంట్‌ నిర్వాకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. అదేవిధంగా అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న బుక్‌మై షో, నోడల్‌ అధికారులకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బుక్‌మై షోలో సన్‌ బర్న్‌ షో ప్లాట్‌ఫామ్‌పై హైదరాబాద్‌ ఈవెంట్‌ కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈవెంట్‌ టికెట్లు మాత్రం అమ్మకానికి పెట్టారు.

సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వాహకులు సన్‌బర్న్‌ మ్యూజికల్‌ నైట్‌  పేరుతో న్యూఇయర్‌ ఈవెంట్‌ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారి దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉందని మాదాపూర్‌ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి అన్నారు. కానీ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను అమ్మినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు అనుమతి రాకముందే బుక్‌ మై షోలో టికెట్లు విక్రయించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే రూ.1499 ప్రారంభ ధర నుంచి రూ. 4999 చొప్పున టికెట్లు అమ్మడం చట్ట విరుద్ధమని, దీంతో సన్‌బర్న్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ సుమన్‌ పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ తెలిపారు. ఇప్పటికే ఈవెంట్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని, అనుమతి లేని ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల జారీకి సహకరించిన బుక్‌ మై షో నోడల్‌ ఆఫీసర్‌, ఎండీలకు కూడా నోటీసులు జారీ చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి: దేశ వ్యాప్తంగా కొత్తగా 116 కరోనా కేసులు నమోదు

Latest News

More Articles