Wednesday, May 8, 2024

బైక్ కొనివ్వలేదని పెళ్లి ఆపిన వరుడు.. స్పాట్‎లో డబ్బులిచ్చిన ఎమ్మెల్యే రసమయి

spot_img

అక్కడ ఓ ఫంక్షన్ హాల్‎లో ఘనంగా పెళ్లి జరుగుతుంది. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది. ఇంతలో ఊహించని విధంగా పెళ్లి కొడుకు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లికి ముందు ఒప్పుకున్నట్లుగా బైక్ కొనిస్తేనే తాళి కడతానని తెగేసి చెప్పాడు.

శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ – మల్లయ్యల కూతురు అనూష వివాహం.. సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో ఇటీవల కుదిరింది. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికీ.. అప్పోసప్పో చేసి ఒప్పుకున్నట్లుగానే పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్ట జెప్పారు. కాగా.. శుక్రవారం కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుండగా.. దంపతులను ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే రసమయి వెళ్లారు.

అయితే అప్పటికే బైకు కోసం వాదనలు జరిగి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడుతాను, లేకపోతే వెళ్ళిపోతాను అంటూ పెళ్లి కొడుకు చెప్పడంతో.. పెళ్ళి కూతురు కుటంబసభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి.. పెళ్లి కొడుకుతో మాట్లాడి, నచ్చజెప్పి బైక్ నేను కొనిస్తాను అంటూ లక్ష రూపాయల నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టాడు. దాంతో వినయ్.. అనూష మేడలో తాళి కట్టడంతో కథ సుఖాంతం అయ్యింది. రసమయి స్వయంగా దగ్గరుండి తోబుట్టువు పెళ్ళికి కట్నంగా బైక్ కొనిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మంచి తనానికి మారు పేరుగా నిలిచి, మానవత్వన్ని చాటుకున్న రసమయి.. పది కాలాల పాటు చల్లగా బతకాలంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన బంధువులు దీవించారు.

Latest News

More Articles