Monday, May 6, 2024

హైదరాబాద్‎లో 8 కరోనా కేసులు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..

spot_img

మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్‌ బయటపడి మరింత కలవరపెడుతోంది. ఇటీవలే కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌తో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి ఈ కొత్త వేరియంట్ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

Read Also: ఇండియాXసౌతాఫ్రికా: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స‌ఫారీలు

గతంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అయిన జేఎన్‌.1 కేసులు దేశంలో 21 నమోదైనట్లు ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. అందులో అత్యధికంగా 300 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహమ్మారి కారణంగా 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళలోనే మూడు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,669 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు కేసులు బయటపడ్డాయి. నిన్న (బుధవారం) హైదరాబాద్‎లో 6 కేసులు నమోదు కాగా.. ఈ రోజు మరో రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. సాయంత్రం వరకు కరోనా హెల్త్ బులెటిన్ విడుదల కానుంది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కేసులు నమోదయ్యాయో తెలుస్తుంది. కాగా.. తాజాగా నమోదైన కొవిడ్ కేసులు ఫీవర్ హాస్పిటల్‎లో నమోదైనవిగా గుర్తించారు వైద్యాదికారులు.

కొత్త వేరియంట్‌ లక్షణాలు..
ఇక ఈ కొత్త వేరియంట్‌ లక్షణాల విషయానికొస్తే.. వైరస్‌ సోకిన వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు మంట, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రమే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: ఆధార్‎తో ఆస్తుల అనుసంధానం! హైకోర్టు కీలక ఆదేశాలు

Latest News

More Articles