Sunday, May 5, 2024

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు

spot_img

బ్యాంకు లోడ్‌ డిఫాల్ట్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ రేవతి మోహితే దేరే, గౌరీ గాడ్సేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పిటిషన్‌ను విచారించలేమని, అందుకే దాన్ని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ పిటిషన్‌తో పాటు ఇతర పరిష్కారాలను పొందేందుకు గోయల్‌కు అవకాశం ఉందని కోర్టు తెలిపింది. మనీలాండరింగ్‌ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటూ ఆయన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలను పాటించకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు నరేశ్‌ గోయల్‌. తనను మొదట ఈడీ కస్టడీకి, ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీకి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేశారు. ఈడీ మాత్రం చట్టపరమైన ప్రక్రియ మాత్రమే అనుసరించి అరెస్టు చేసినట్లు తెలిపింది. గోయల్‌ తప్పించుకు తిరగడంతో పాటు విచారణకు సహకరించనందున ఆయన కస్టడీ తప్పనిసరి అని చెప్పింది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని ఆరోపించింది. రూ.538కోట్ల కెనరా బ్యాంకు ఫ్రాడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నరేశ్‌ గోయల్‌ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ కేసులో సెప్టెంబర్‌ ఒకటిన ఈడీ గోయల్‌ను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 14 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. సెప్టెంబర్‌ 14న జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. బ్యాంకు మోసం వ్యవహారంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు గోయల్‌, ఆయన భార్య అనిత, ఆ కంపెనీకి చెందిన కొందరు మాజీ అధికారులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. జెయిట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.848.86 కోట్ల రుణం మంజూరు చేయగా.. ఇందులో రూ.538.62కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపిస్తూ కెనరా బ్యాంక్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఇది కూడా చదవండి: టీఎస్‌ సెట్‌ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ

Latest News

More Articles