Friday, May 10, 2024

రష్మిక ఫేక్ వీడియో క్రియేట్ చేసింది ఆమె అభిమానే.. ఫ్యాన్ పేజీకి లక్షల్లో ఫాలోవర్లు

spot_img

ప్రముఖ నటి రష్మిక మందన్న‘డీప్‌ఫేక్’ వీడియోను ఏఐ టెక్నాలజీతో సృష్టించిన వ్యక్తిని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఈమని నవీన్‎గా గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది. గుంటూరు జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవీన్.. అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి, ఆ వీడియో సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేశాడు.

ఈ కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేకమంది సోషల్ మీడియా ఖాతాదారులను విచారించామని, రష్మిక డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని తెలిపారు.

Read also: వీకెండ్ రైడ్.. డెడ్ ఎండ్‎ను ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి

అనుమానితులను లోతుగా విచారించిన తర్వాత రష్మిక డీప్ ఫేక్ వీడియో ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అప్ లోడ్ అయినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఒరిజినల్ వీడియో వాస్తవానికి జరా పటేల్ అనే బ్రిటీష్ మోడల్‎దని, ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్‎లో 2023 అక్టోబరు 9న పోస్టు చేశారని, ఆ వీడియో ఆధారంగా రష్మిక డీప్ ఫేక్ వీడియోను రూపొందించి అక్టోబరు 13న పోస్టు చేశారని వెల్లడించారు.

సేకరించిన ఆధారాల ప్రకారం ఏపీలోని గుంటూరు చేరుకుని, నిందితుడు నవీన్ ఆచూకీ కనుగొన్నామని తెలిపారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు. విచారణలో నవీన్, తాను రష్మికకు పెద్ద అభిమానినని చెప్పాడని, ఆమె పేరిట ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నట్టు తెలిపాడని వివరించారు. మరో ఇద్దరు సెలబ్రిటీల పేరిట కూడా నవీన్ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాడని డీసీపీ వెల్లడించారు. కాగా, రష్మిక డీప్ ఫేక్ వీడియో పోస్టు చేసిన అనంతరం నవీన్ నిర్వహించే ఫ్యాన్ పేజీల్లో ఒకదానికి ఫాలోవర్ల సంఖ్య 90 వేల నుంచి ఒక్కసారిగా 1.08 లక్షలకు పెరిగిపోయిందని తెలిపారు.

అయితే, ఈ డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, సెలెబ్రిటీలు సైతం దాన్ని ఖండిస్తుండడంతో భయపడిపోయిన నవీన్… ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడని డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు.

Latest News

More Articles