Friday, May 10, 2024

మొన్నటి వరకు కేజీ రూ. 300.. నేడు మాత్రం కేవలం 30 పైసలు

spot_img

నెల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్నంటింది. సామాన్యుడు టమాట పేరెత్తడానికి కూడా భయపడ్డాడు. అంతలా పెరిగిపోయింది టమాట ధర. ఆ రెండు నెలల్లో టమాటా పంట అమ్మిన రైతులు కోటీశ్వరలు అయ్యారు. కిలో టమాటా రూ. 300 వరకు పలికింది. కానీ ఇప్పుడు ధర లేక నేల చూపులు చూస్తుంది. గిట్టుబాటు ధర రావడం లేదని రైతులే నేలపై పారబోసి వెళ్తున్నారు. మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాట ధర.. నేడు అమాంతం పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.300 పలికి బెంబేలెత్తించగా, నేడు 30 పైసలకూ కొనే దిక్కులేక నేలపాలవుతున్నది. 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది.

ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌, కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం టమాట ధర పూర్తిగా పతనమైంది. 25 కేజీల బాక్స్‌ రూ.10 నుంచి రూ.35 వరకు పలికింది. అంటే కేజీ ధర దాదాపు 30 నుంచి 40 పైసలు అన్నమాట. రైతుకు కనీసం రవాణా చార్జీలు రాని పరిస్థితి నెలకొంది. నెల క్రితం మార్కెట్‌కు టమాటలు తీసుకొచ్చి నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే టమాట మూడు నెలల క్రితం ఊహకందని ధరలతో కొందరు రైతులను కోటీశ్వరులను చేయగా, ఇప్పుడు అదే టమాట రైతుకు కంటతడి పెట్టిస్తున్నది. రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో జాతీయరహదారి పక్కన రాశులుగా పారబోసి పోతున్నారు. వాటిని కొందరు స్థానికులు తీసుకెళ్లగా.. మిగిలినవి పశువులకు మేతగా మారాయి.

Latest News

More Articles