Wednesday, May 1, 2024

ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది

spot_img

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకురాలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి గత ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ రాశారు. అనంతరం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‎లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆవేదన చెందారు. నేడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు.. కేవలం డబ్బు డబ్బు అనే నినాదంతో నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిలువేత్తున వేలం పాటగా మారిందని స్రవంతి అన్నారు. మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.

Read Also: రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తా అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి

‘కనీసం మహిళ అనే గౌరవం కూడా కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వలేదు. రేపటి నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. పార్టీ ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. వాళ్లు ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‎ది అని అనడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది. ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి.. నా వంతుగా పని చేశాను. కానీ నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుంది. ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది’ అని పాల్వాయి స్రవంతి తీవ్ర విమర్శలు చేశారు.

Read Also: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న మూడు పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది అని నాకు అనిపించిందన్నారు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ అని స్రవంతి అన్నారు. ప్రతి పార్టీలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ లోటుపాట్లను సవరిస్తూ అందరిని కలుపుకొని ముందుకు పోతుందని స్రవంతి అన్నారు. అందుకే తాను త్వరలోనే బీఆర్ఎస్‎లో చేరతానని చెప్పారు.

Latest News

More Articles